ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పి. భరత్ భూషణ్, ఎండీ కె. విశ్వనాథన్‌లు నంది అవార్డులకు సంబంధించిన అంశాలపై శనివారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో సంయుక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
- 2012 నుంచి 2016 వరకు పెండింగ్‌లో ఉన్న నంది ఫిల్మ్, టీవీ అవార్డుల ప్రదానానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం
- 2017 నుంచి 2024 వరకు ఏటా 4 చొప్పున (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ) ఫిల్మ్, టీవీ అవార్డుల ప్రదానానికి అంగీకారం
- 2025 సంవత్సరపు నంది ఫిల్మ్, టీవీ అవార్డులను కూడా అందించాలని నిర్ణయం
- ఫిల్మ్, నేషనల్ ఫిల్మ్ అవార్డులు అమరావతి లేదా విజయవాడ వేదికగా, టీవీ అవార్డులు తిరుపతి వేదికగా ప్రదానం
- అన్ని అవార్డుల ప్రదానోత్సవాలను డిసెంబర్ 2026లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చైర్మన్ పి. భరత్ భూషణ్ ఈ సందర్భంగా తెలిపారు. గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్, టీవీ అవార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. అదే విధంగా 2017 నుంచి 2024 వరకు సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ) ఫిల్మ్, టీవీ అవార్డులను అందించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. వీటితో పాటు 2025 సంవత్సరానికి నంది ఫిల్మ్, టీవీ అవార్డులను కూడా అందించనున్నట్టు నిర్ణయించినట్టు చెప్పారు.
నంది ఫిల్మ్, జాతీయ చలనచిత్ర (నేషనల్ ఫిల్మ్) అవార్డులను అమరావతి లేదా విజయవాడ వేదికగా, నంది టీవీ అవార్డులను తిరుపతి వేదికగా అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ అవార్డులన్నింటినీ డిసెంబర్ 2026లోగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియ విషయంలో అక్టోబర్‌లో నంది ఫిల్మ్, టీవీ అవార్డుల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తామని, నవంబర్‌లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని, డిసెంబర్లో ప్రదానోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చైర్మన్ వివరించారు.
మొత్తం 46 అవార్డులను అందించనున్నట్టు తెలిపారు — వాటిలో ఉత్తమ ప్రదర్శన, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, తృతీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి తదితర విభాగాలు ఉన్నాయి. నంది ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులు, ప్రశంసాపత్రంతో పాటు వివిధ కేటగిరీల్లో 8 గోల్డ్ మెడల్స్ కూడా అందించనున్నారని చెప్పారు.
జాతీయ చలనచిత్రాల అవార్డులకు పారితోషికం వివరాలను కూడా చైర్మన్ వెల్లడించారు — ఎన్.టి.ఆర్. నేషనల్ ఫిల్మ్ అవార్డుకు రూ.5 లక్షలు, బి.ఎన్. రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డుకు రూ.2 లక్షలు, నాగిరెడ్డి-చక్రపాణి నేషనల్ ఫిల్మ్ అవార్డుకు రూ.2 లక్షలు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డుకు రూ.2 లక్షలు చొప్పున నగదు పారితోషికం అందించనున్నారు. తదితర విభాగాల్లో కలిపి మొత్తం 48 అవార్డులను అందించనున్నారని, వాటిలో ప్రథమ, ద్వితీయ ఉత్తమ టెలీ ఫిల్మ్, టెలీ ఫీచర్స్, మెగా టీవీ సీరియల్, డైలీ టీవీ సీరియల్, టీవీ బాలల చిత్రం విభాగాలతో పాటు ఉత్తమ నటుడు, నటి, సహాయ నటుడు, హాస్య నటుడు, హాస్య నటి, ప్రతినాయకుడు, బాలల నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత తదితర విభాగాల్లో అవార్డులు ఉంటాయని తెలిపారు. నంది టీవీ అవార్డు గ్రహీతలకు కూడా బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులు, ప్రశంసాపత్రంతో పాటు నగదు పారితోషికం అందించబడుతుందని ఎండీ కె. విశ్వనాథన్‌తో కలిసి చైర్మన్ పి. భరత్ భూషణ్ తెలియజేశారు.
