క్రీడా కోటా నియామకాల్లో రాత పరీక్షలు ఉండవన్న ప్రాథమిక విషయం కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలియదని, డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ నియామకాలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఎద్దేవా చేశారు. క్రీడా కోటా కేటాయింపులు నేరుగా జరుగుతాయని, ఈ కనీస విషయం తెలియకుండానే జగన్ డీఎస్సీపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.

రామకృష్ణ వ్యవహారంలో జగన్ పత్రికలో అబద్ధాలు రాశారని, దానికి సజీవ సాక్ష్యంగా రామకృష్ణ స్వయంగా అక్కడే ఉన్నారని కేశినేని గుర్తు చేశారు. రామకృష్ణకు డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారంటూ తప్పుడు రాతలు రాశారని, వాస్తవానికి ఆయన ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నారని స్పష్టం చేశారు. డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, నవీన్‌కు ర్యాంకు వచ్చినంత మాత్రాన నేరుగా ఉద్యోగం రాదని, మెరిట్ కోటా నిబంధనల ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు వెళ్లాకే ఎంపికలు జరుగుతాయని వివరించారు.

మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకూ స్పందించలేదని కేశినేని విమర్శించారు. డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు ఇస్తే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, తమ అధికారులు ఇచ్చిన సమాచారం తప్పు అని రుజువు చేయాలని, అంతేకాక దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి బహిరంగంగా చర్చించాలని పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కు సవాలు విసిరారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరిస్తూ, మరో మూడు డీఎస్సీలు కూడా లోకేష్ నేతృత్వంలో నిర్వహించి తీరతామని ప్రకటించారు.

ఏపీపీఎస్సీలో గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ కొనసాగుతోందని, త్వరలో నివేదిక వెలువడనుందనే భయంతోనే డీఎస్సీపై బురద జల్లుతున్నారని కేశినేని ఆరోపించారు. గ్రూప్‌–1 అక్రమాలపై కోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతోందని, ఏపీపీఎస్సీలో అవకతవకలు బయటకు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైసీపీ నేతలు గ్లోబల్‌ స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇలాంటి అబద్ధాల ప్రచారంతో వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని వ్యాఖ్యానించారు.

క్రీడా కోటాపై వైసీపీ చేస్తున్న గోల పట్ల అధికారులు ఇప్పటికే వివరణ ఇచ్చారని, నిజమైన అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని, అయితే ఆరోపణలు చేస్తున్నవారు తగిన ఆధారాలు చూపాలని కేశినేని డిమాండ్ చేశారు. జూడో అసోసియేషన్‌లో భరత్‌ లేడని, ఇలాంటి తప్పుడు వివరాలతోనే వైసీపీ ప్రచారం సాగిస్తోందనడానికి రామకృష్ణ ఉదంతమే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలందరి కుటుంబాల్లో ఆనందం చూడటమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ, నారా లోకేష్ చేసిన సవాలును జగన్మోహన్ రెడ్డి వెంటనే స్వీకరించాలని కేశినేని శివనాథ్ కోరారు.