మూడేళ్ల కిందట ఇదే రోజు నీతి, నిజాయితీకి నిలువుటద్దమైన సీఎం చంద్రబాబునాయుడును ఆనాటి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో నిర్బంధించిందని, కోర్టులు, ప్రజలే కాకుండా మొత్తం ప్రపంచమే ఆయనకు అండగా నిలిచిందని, చివరికి కడిగిన ముత్యంలా అక్రమ కేసుల నుంచి బయటపడ్డారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
తన రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబునాయుడు ఏనాడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, అటువంటి నేతపై కక్షసాధింపులకు పాల్పడిన వైసీపీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టారని మంత్రి అన్నారు. 2023 ఇదే రోజున సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఘటనను గుర్తు చేసుకుంటూ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నేతృత్వంలో కూటమి నాయకులు, మహిళలు బుధవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించారు. సీఎం చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నిజమే గెలిచిందంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, తన అసమర్థ పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో పాటు సీఎం చంద్రబాబుకు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజామద్దతును చూసి జగన్ ఓర్వలేకపోయారన్నారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏనాడూ అవినీతి, అక్రమాలకు పాల్పడని సీఎం చంద్రబాబుపై ఆనాడు తప్పుడు కేసులు పెట్టి జైల్లో 53 రోజులు బంధించారని ఆమె గుర్తు చేశారు.
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఏక కంఠంతో ఖండించారని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన తెలియజేశారని మంత్రి తెలిపారు. చివరికి కోర్టులు సైతం సీఎం చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని తీర్పునివ్వడంతో, జగన్ పెట్టిన తప్పుడు కేసుల నుంచి సీఎం చంద్రబాబునాయుడు కడిగిన ముత్యంలా బయటకొచ్చారన్నారు.
ఎప్పటికైనా నిజం, ధర్మమే గెలుస్తుందని సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టు రుజువు చేసిందని, జగన్ ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా, అక్రమంగా జైల్లో నిర్బంధించినా వెనుకంజ వేయలేదని, ప్రజల పక్షానే సీఎం చంద్రబాబు నిలిచారని మంత్రి సవిత అన్నారు. 53 రోజుల పాటు చంద్రబాబు విడుదల కోసం పరితపించిన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు, విదేశాలకు చెందిన ఎన్ఆర్ఐలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
రాజకీయాల్లో కక్షసాధింపులకు తావు లేదని, ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్ బుద్ధి మారడం లేదని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్న జగన్ తన మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపించిన ఆమె, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడును, కూటమి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా కుట్ర పన్నుతున్న వైసీపీకి, జగన్కు స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
