బీడ్ (మహారాష్ట్ర), సెప్టెంబర్ 17: మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ గురువారం 20 రోజుల తన నిరాహార దీక్షను విరమించారు. ఆగస్టు 29న దీక్ష ప్రారంభించిన ఆయన, ముంబై వైపు సాగుతూ బీడ్ జిల్లా పటోడా వద్ద ఆగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరాఠా రిజర్వేషన్‌పై మంత్రివర్గ ఉపసంఘానికి నేతృత్వం వహిస్తున్న మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ నేతృత్వంలోని బృందంలో మంత్రి దాదా భూసే, ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్, ఎమ్మెల్యే సురేశ్ ధాస్ తదితరులు ఉన్నారు. మూడు నెలల్లో డిమాండ్లపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. కొల్హాపూర్, సతారా గెజిట్లపై అడ్వకేట్ జనరల్ లిఖితపూర్వక అభిప్రాయం అందిన తర్వాత చర్యలకు మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందని విఖే పాటిల్ చెప్పారు.

'ఈ మూడు నెలల్లో మోసపోతే పిల్లలు, మహిళలతో సహా అందరం నేరుగా ముంబైకి వస్తాం' అని జరంగే హెచ్చరించారు. ముంబై మార్చ్ కోసం సమీకరించిన మద్దతుదారులను ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆయన కోరారు. హైదరాబాద్, సతారా, ఔంధ్ గెజిట్లలోని రికార్డులకు అధికారిక గుర్తింపు ఇవ్వాలని, ఏ ఒక్క 'కుంబీ' రికార్డును విస్మరించబోమని ముఖ్యమంత్రి సంతకంతో లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

జరంగే డిమాండ్లలో 13కు గాను 12 ప్రభుత్వం అంగీకరించిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు. మిగిలిన 13వ డిమాండ్‌కు సంబంధించిన న్యాయపరమైన సవాళ్లను కూడా స్పష్టంగా వివరించినట్లు ఆయన తెలిపారు. జరంగే దీక్ష విరమించడంతో, ఆయన ప్రతిపాదిత ముంబై నిరసనపై దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు శుక్రవారం ముగించింది.