విశాఖ: విశాఖ జిల్లా మధురవాడలోని చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలను 'ప్రాజెక్ట్ చంద్రా'లో భాగంగా దివీస్ ల్యాబ్స్ సహకారంతో ఆధునీకరించిన అనంతరం రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

  • సమాజంలో మార్పు కోసం విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు
  • క్రీడల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు 'షీ ప్లే' విధానం
  • ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

పాఠశాలకు చేరుకున్న మంత్రి లోకేష్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆధునీకరించిన తరగతి గదులు, క్రీడా మైదానాలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించిన మంత్రి, విద్యార్థులతో కలిసి సరదాగా కాసేపు వాలీబాల్ ఆడారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సాధారణ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు భిన్నంగా ఈసారి మంత్రి లోకేష్ విద్యార్థులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో బురదమయంగా ఉండే చంద్రంపాలెం పాఠశాల పూర్తి స్థాయిలో ఆధునీకరణ తర్వాత రూపురేఖలు మారిపోయాయని, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ఇదే విధంగా అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. క్రీడల్లో మహిళలకు అవకాశాలు తక్కువగా ఉండటంపై ప్రశ్నించగా, మహిళలను క్రీడల్లో మరింతగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా 'షీ ప్లే' విధానాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి ఉదాహరణను ప్రస్తావిస్తూ, ప్రతిభకు సరైన అవకాశం లభిస్తే మహిళలు ప్రపంచ స్థాయిలో రాణించగలరని అన్నారు.

సమాజంలో మార్పు కోసం విద్యావంతులైన, ఆలోచించే యువత పెద్దఎత్తున రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. రాజకీయాలు కేవలం పదవులు, ఎన్నికలకు పరిమితం కాదని, ప్రజల జీవితం, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలకమైన వేదిక అని చెప్పారు. దేవుడిని నమ్ముతారా అన్న ప్రశ్నకు, "సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనేది మా సిద్ధాంతం" అని బదులిచ్చారు. పదో తరగతి ఫలితాల ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా కేవలం విద్యార్థుల ఫొటోలనే ఉపయోగించడం వెనుక ఉద్దేశాన్ని కూడా మంత్రి వివరించారు.

దివీస్ ల్యాబ్స్ డైరెక్టర్ నీలిమ, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పాఠశాలలో ప్రాథమిక తరగతులకు 'వన్ క్లాస్ – వన్ టీచర్' విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రస్తుతం 10 వేల పాఠశాలల్లో ఈ విధానం అమల్లో ఉందని మంత్రి తెలిపారు. చంద్రంపాలెం పాఠశాలను ఆధునీకరించేందుకు ముందుకు వచ్చిన దివీస్ ల్యాబ్స్‌కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, దివీస్ ల్యాబ్ సిబ్బంది, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.