కర్నూలు రిలయన్స్ పానీయాల ప్లాంట్ను సందర్శించిన కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య, కలెక్టర్ డా.ఏ.సిరి — స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
కర్నూలు, అక్టోబర్ 6 (ఎక్స్ప్రెస్ టుడే): స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.కృష్ణయ్య యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, మామిడి జ్యూస్ తయారీలో తోతాపురి, అల్ఫోన్సో రకాలతో పాటు స్థానికంగా విస్తారంగా లభించే బంగనపల్లి మామిడిని వినియోగించే అవకాశాలను పరిశీలించాలని రిలయన్స్ యాజమాన్యానికి సూచించారు. స్థానిక రైతుల నుంచి బంగనపల్లి మామిడిని పెద్దఎత్తున సేకరించి, దాని రుచిని పరిగణనలోకి తీసుకుని అల్ఫోన్సోకు ప్రత్యామ్నాయంగా లేదా మిశ్రమంగా వినియోగించే అంశంపై పరిశోధన చేపట్టాలన్నారు. స్థానికంగా లభించే మామిడి రకాలకు పరిశ్రమల్లో ప్రాధాన్యం కల్పించడం ద్వారా స్థానిక రైతులకు మార్కెట్ అవకాశాలు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి మరింత ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
పానీయాల తయారీ పరిశ్రమల్లో నాణ్యత, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని యాజమాన్య ప్రతినిధులకు సూచించారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు, ముఖ్యంగా భూములు ఇచ్చిన కుటుంబాలకు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల కోసం స్థానిక యువతకు పరిశ్రమ ఆధ్వర్యంలో శిక్షణ అందించి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని తెలిపారు.
పర్యావరణ అనుమతి నిబంధనల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలోనే కొంత మొత్తాన్ని ప్రభావిత గ్రామాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేటాయించాల్సి ఉంటుందని, సంబంధిత నిధులను కేవలం సాధారణ కార్యక్రమాల కోసం కాకుండా ప్రభావిత గ్రామాల వాస్తవ అవసరాలకు అనుగుణంగా వినియోగించాల్సిన అవసరం ఉందని చైర్మన్ పేర్కొన్నారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, వారికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తేనే కేటాయించిన నిధులకు సార్థకత ఉంటుందన్నారు.
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ, నైపుణ్యం లేకపోవడం స్థానిక యువతకు అడ్డంకిగా మారకుండా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించాలని యాజమాన్య ప్రతినిధులకు సూచించారు.
ముందుగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, జిల్లా కలెక్టర్ పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రిలయన్స్ ప్లాంట్లో తయారవుతున్న పానీయాల విధానాన్ని పరిశీలించారు.
