కర్నూలు, అక్టోబర్ 19: నగరంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పలువురు టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. నగరంలోని 8వ వార్డుకు చెందిన షేక్ షా, నజీర్‌లు వైఎస్సార్‌సీపీని వీడి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో 8వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ నిలోఫర్ విజయానికి కృషి చేయాలని వారికి సూచించారు.

అలాగే కర్నూలు నగరంలోని ధర్మపేటకు చెందిన వీరేష్ తన అనుచరులతో కలిసి మంత్రి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ధర్మపేటకు చెందిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సురేంద్ర గెలుపు కోసం తన అనుచరులతో కలిసి కృషి చేయాలని మంత్రి.. వీరేష్‌కు సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ, ప్రజల ఆదరణతో ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.