కర్నూలు, సెప్టెంబర్ 13: కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనాన్ని ఘనంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆదివారం కర్నూలులోని వినాయక ఘాట్ వద్ద కేసీ కాలువ, నన్నూర్ టోల్ ప్లాజా వద్ద హంద్రీనీవా ప్రాంతాల్లో వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి టీజీ భరత్ పరిశీలించారు.

  • సుంకేసుల బ్యారేజీలో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యల్పంగా 0.288 టీఎంసీల నీటి నిల్వ
  • వినాయక ఘాట్ వద్ద కేసీ కాలువలో గోడలు నిర్మించి ట్యాంక్ తరహాలో నీటి నిల్వకు ఏర్పాట్లు
  • పంప్‌హౌస్ నుంచి వృథాగా పోతున్న సుమారు 20 లక్షల లీటర్ల నీటిని తరలించే ప్రణాళిక
  • నిమజ్జన కమిటీ సభ్యుల పరిశీలన అనంతరం తుది ప్రణాళిక రూపకల్పన: మంత్రి

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి నిమజ్జన ఏర్పాట్లు, నీటి లభ్యత, భద్రత, మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్న మంత్రి టీజీ భరత్, అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సుంకేసుల బ్యారేజీలో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యల్పంగా 0.288 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని మంత్రి తెలిపారు. దీంతో సుంకేసుల బ్యారేజీ నుంచి నేరుగా కేసీ కాలువకు నిమజ్జనం కోసం నీటిని విడుదల చేసే పరిస్థితి ఈసారి లేదని, ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించామని వివరించారు.

వినాయక ఘాట్ వద్ద కేసీ కాలువలో ఎన్నడూ లేని విధంగా రెండు వైపులా గోడలు నిర్మించి ట్యాంక్ తరహాలో నీటిని నిల్వ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పంప్‌హౌస్‌ నుంచి ప్రతిరోజూ వృథాగా పోతున్న సుమారు 20 లక్షల లీటర్ల నీటిని కేసీ కాలువకు తరలించి, వినాయక ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ట్యాంక్‌లో నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్రేన్లు, ఇతర అవసరమైన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం హంద్రీనీవాలో నీటి ప్రవాహం బాగుందని, వినాయక నిమజ్జనం సమయంలో కూడా నిరంతర నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉందన్నారు. కేసీ కాలువ, నన్నూర్ టోల్ గేట్ వద్ద హంద్రీనీవా ప్రాంతాలను వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు పరిశీలించాలని మంత్రి సూచించారు. కమిటీ సభ్యుల పరిశీలన, వారి నిర్ణయం ఆధారంగా నిమజ్జనానికి సంబంధించిన తుది ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు.

వచ్చే జూన్ వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి అన్నారు. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూనే వినాయక నిమజ్జనాన్ని కూడా ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా కర్నూలులో వినాయక నిమజ్జనం నిర్వహించేలా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.