కర్నూలు, సెప్టెంబర్ 4: మా ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో 10వ వార్డులో రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

  • కర్నూలు అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి ఉంది: మంత్రి టీజీ భరత్
  • ప్రభుత్వ పనితీరుకు ప్రజలు 100 మార్కులు ఇచ్చారని వెల్లడి
  • అర్హులైన కొత్త లబ్ధిదారులకు త్వరలో పెన్షన్ల దరఖాస్తు అవకాశం
  • హైకోర్టు బెంచ్‌పై అడ్వకేట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పనితీరుకు 100 మార్కులు ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రజలు అభినందిస్తున్నారని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న కొత్త లబ్ధిదారులకు త్వరలోనే పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

కర్నూలు నగరంలో డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు తదితర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. వార్డు, క్లస్టర్, బూత్ స్థాయి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి మెహబూబ్ ఖాన్, హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు బెంచ్‌పై అడ్వకేట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి టీజీ భరత్

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో అడ్వకేట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తాను వ్యక్తిగతంగా కలిసి కోరగా, కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ గారు కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారని మంత్రి తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది న్యాయపరమైన ప్రక్రియ, విధానాలకు అనుగుణంగా జరగాల్సిన అంశమని పేర్కొన్నారు. అందువల్ల అడ్వకేట్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆందోళనలు చేయకుండా ఓపికగా ఉండాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ పాలనలో హైకోర్టు విషయంలో ఇచ్చిన హామీ అమలు కాలేదని మంత్రి విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. కర్నూలు అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

వినాయక చవితి వేడుకల్లో ప్రజలు సహకరించాలి: మంత్రి టీజీ భరత్

ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కర్నూలులో నీటి లభ్యత తక్కువగా ఉంది. అందువల్ల పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేయకుండా, అందరూ కలిసి చిన్న పరిమాణంలో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ కోరారు. చిన్న మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి వినియోగం తక్కువగా ఉండటంతో పాటు, అవసరమైతే ఇంటి వద్దే నిమజ్జనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.