కర్నూలు, సెప్టెంబర్ 19: కర్నూలు నగరంలోని హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మౌర్య ఇన్ లో హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షులు రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొని 20 మంది దివ్యాంగులకు కృత్రిమ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. సమాజంలో అవసరమైన వారికి అండగా నిలుస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ పరికరాలను అందించడం ద్వారా వారి జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రంజిత్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆకాంక్షించారు. రంజిత్ చిన్న తరహా పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసిందని, దీనికి ప్రభుత్వం తరఫున, తన వంతుగా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు.

ప్రజా సేవలో భాగంగా టీజీవి గ్రూప్ తరఫున కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలిచి, అవసరమైన వారికి సహాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పామన్న, తదితరులు పాల్గొన్నారు.