కర్నూలు నగరంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 16వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఈ జాబ్ మేళా ద్వారా వివిధ రంగాల్లో మొత్తం 1,053 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. విద్యార్హతకు అనుగుణంగా వివిధ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండనున్న నేపథ్యంలో కర్నూలు నగరంతో పాటు జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ కోరారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్‌కు భరోసా కల్పించడంతో పాటు, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరూ జాబ్ మేళాకు హాజరై తమ అర్హతకు తగిన ఉద్యోగాన్ని పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు. కర్నూలు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కెరీర్‌కు మంచి బాట వేసుకోవాలని మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు.