కర్నూలులో రాయలసీమ జిల్లాల సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో సమీక్షా సమావేశం — కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

కర్నూలు, అక్టోబర్ 6 (ఎక్స్‌ప్రెస్ టుడే): సిమెంట్ పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.కృష్ణయ్య పేర్కొన్నారు.

నగరంలోని కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తో కలిసి రాయలసీమ జిల్లాల్లోని సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశుభ్రత, స్వచ్ఛత, 50 శాతం పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇందుకోసం పరిశ్రమలు కూడా బాధ్యతగా వ్యవహరించి, పచ్చదనం పెంపు, కాలుష్య నివారణకు కృషి చేయాలని కోరారు. చట్ట ప్రకారం పరిశ్రమల్లో తప్పనిసరిగా 33 శాతం పచ్చదనం ఉండేలా చెట్లు నాటాలని, ఇందులో భాగంగా వాణిజ్యపరమైన పండ్ల తోటలు కూడా పెంచవచ్చని అన్నారు.

పరిసర ప్రాంతాల ప్రజలు, పొలాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని, పరిసరాలను కాపాడేలా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, దుమ్ము, ధూళి లేకుండా కాలుష్య నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశ్రమల యాజమాన్యాలను ఆదేశించారు.

సిమెంట్ రవాణా చేసే భారీ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, రోడ్ల అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. వాన నీటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేసి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని, పరిశ్రమల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని సూచించారు.

సిమెంట్ పరిశ్రమల్లో ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్‌ను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలను ఆదేశించారు.