విశాఖపట్నంలోని సిరిపురం సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం వాల్తేర్ క్లబ్ సమావేశ మందిరంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో రాష్ట్ర విద్య, ఐటీ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణ అనంతరం రోశయ్య జీవిత విశేషాలతో కూడిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి తిలకించి, ఆయన కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోశయ్య రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన మహోన్నత రాజకీయ వేత్త అని కొనియాడారు. విజయవాడలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైజ్' అని నామకరణ చేసినట్టుగానే, రోశయ్య గౌరవార్థం ఆయన విగ్రహానికి 'స్టాచ్యూ ఆఫ్ స్టేట్స్‌మెన్' అని పేరు పెట్టాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు.
రోశయ్య రాజకీయ ప్రయాణం, ఆయన పట్టుదల, విలువలకు కట్టుబడిన తీరు నేటి యువతరానికి, ప్రజాప్రతినిధులకు ఆదర్శనీయమని పేర్కొన్న మంత్రి, రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యులు, వైశ్య సంఘ ప్రతినిధులు కోరిన వెంటనే విగ్రహం ఏర్పాటుకు అనుమతించినట్టు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, పాఠ్యపుస్తకాల్లో రోశయ్య జీవిత చరిత్ర, తెలుగు సమాజానికి ఆయన సేవలు, త్యాగాల గురించి ప్రత్యేక చాప్టర్ చేర్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. రోశయ్య జ్ఞాపకాలతో కూడిన ఎక్స్‌పీరియన్షియల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రతో పుస్తకాలు రచించాలని పిలుపునిచ్చారు. రాబోయే 18 నెలల్లో స్థల ఎంపిక, ఇతర పనులు పూర్తి చేసి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మ్యూజియాన్ని జాతికి అంకితం చేయాలని వైశ్య సంఘ పెద్దలు, కుటుంబ సభ్యులను కోరారు.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి టి.జి. వెంకటేష్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించి ప్రోత్సహించారని, ఆర్య వైశ్యుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వైశ్య సామాజికవర్గానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి సభ్యత్వం కల్పించాలని ఈ వేదిక ద్వారా మంత్రి లోకేష్‌ను కోరారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారే తప్ప శత్రువులు ఉండరనే విషయాన్ని రోశయ్య జీవితం నిరూపించిందని, మంత్రి లోకేష్ సూచనల మేరకు విగ్రహ ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగిందని తెలిపారు. విశాఖపట్నం లోక్‌సభ సభ్యులు ఎం. శ్రీ భరత్ మాట్లాడుతూ, ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో రోశయ్య ఎప్పుడూ ఓవర్‌డ్రాఫ్ట్‌లకు వెళ్లకుండా, ఎఫ్ఆర్బీఎం పరిమితులు దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించారని, కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూనే ప్రజలపై అదనపు పన్నుల భారం మోపకుండా సమర్థవంతంగా పరిపాలన అందించారని కొనియాడారు.
