అర్హులైన ఓటర్లను మోసపూరితంగా జాబితా నుంచి తొలగించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని, ముఖ్యంగా మైనారిటీ, దళిత, వెనుకబడిన వర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.

గురువారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, తమ రాష్ట్రంలో లక్షకు పైగా ఓటర్లను తొలగించేందుకు ప్రయత్నించారని, ఇందుకు ఉపయోగించిన ఫారం 7 దరఖాస్తులు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ముద్రితమయ్యాయని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన తర్వాత సంబంధిత వ్యక్తులు బూత్ లెవల్ అధికారులను సంప్రదించి ఆ ఫారాలను వెనక్కి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ‘ఇది నేరం కాదా?’ అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేతలందరికీ ఓటర్లను కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్న శివకుమార్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనకోసమో, కాంగ్రెస్ కోసమో కాకుండా గొప్ప పని చేస్తున్నారని ప్రశంసించారు.

ఇదిలా ఉండగా, జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 5,698 ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం 7 దరఖాస్తులు సమర్పించారన్న ఆరోపణపై ఇద్దరు బీజేపీ బూత్ లెవల్ ఏజెంట్లు, మరికొందరిపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యా రెడ్డి ఫిర్యాదుతో సోమవారం రాత్రి జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్ 16 నుంచి అక్టోబర్ 5 మధ్య ఓటర్ల జాబితా సమ్మరీ రివిజన్ సమయంలో ఈ అక్రమం జరిగినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.