బెంగళూరు, అక్టోబర్ 13 (ఎక్స్‌ప్రెస్ టుడే): స్టింగ్ ఆపరేషన్‌కు చెందినవిగా ప్రచారంలో ఉన్న వీడియో క్లిప్‌లను ప్రచురించడం, ప్రసారం చేయడం, హోస్ట్ చేయడంపై మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలను నిరోధిస్తూ బెంగళూరులోని కోర్టు మంగళవారం తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.

తనను అపఖ్యాతిపాలు చేసే ఉద్దేశంతోనే ఈ క్లిప్‌లు ప్రచారంలోకి వచ్చాయని పేర్కొంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులను రిజర్వ్ చేయగా, మంగళవారం తాత్కాలిక నిషేధాజ్ఞలు వెలువడ్డాయి. ఆయన రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారన్న అంశాన్ని కోర్టు గమనించినట్టు ‘ది సౌత్ ఫస్ట్’ పేర్కొంది.

ఈ వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు కోరుతూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశానని సిద్ధరామయ్య తెలిపారు. ముందు జాగ్రత్తగానే కోర్టును ఆశ్రయించానని, చివరకు నిజమే గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య దీన్ని కుట్రగా అభివర్ణించారు.

కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి కూడా స్టింగ్ ఆపరేషన్లపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య భయపడకుండా పోరాడాలని సూచించారు. మరోవైపు బీజేపీ నేత అశోక, కాంగ్రెస్ సిద్ధరామయ్యను వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. (ఐఏఎన్ఎస్, ది సౌత్ ఫస్ట్ కథనాల ఆధారంగా)