కర్నూలు, ఆగస్టు 21: కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖను జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రారంభించారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్గదర్శకాల మేరకు 5,000కు పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీలలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గోరంట్ల గ్రామంలో నూతన శాఖను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ, 5,000కు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా గోరంట్లలో నూతన శాఖను ఏర్పాటు చేసినందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ను అభినందించారు. గ్రామ ప్రజలు ఈ బ్యాంకింగ్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు బ్యాంకు రుణాలు మరియు ఇతర ఆర్థిక సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటని, కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఐదు శాఖలు ఉండగా గోరంట్లలో నూతన శాఖ ఏర్పాటుతో జిల్లాలో మొత్తం ఆరు శాఖలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా పంట రుణాలు, బంగారు రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు తదితర బ్యాంకింగ్ సేవలను విస్తృతంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.