న్యూయార్క్, సెప్టెంబర్ 18: ఇరాన్‌పై అణు ఆంక్షల అమలును పర్యవేక్షిస్తున్న ఐక్యరాజ్యసమితి నిపుణుల బాధ్యతల గడువును పొడిగించాలని కోరుతూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని భద్రతా మండలిలో రష్యా, చైనా గురువారం వీటో చేశాయి.

చైనా రాయబారి ఫు కాంగ్ మాట్లాడుతూ, ద్వంద్వ ప్రమాణాలు, రాజకీయ మార్పిడి, ఒత్తిడి, ఘర్షణ మార్గాలను మండలి సభ్యులు విడనాడాలని కోరారు. రష్యా రాయబారి వాసిలీ నెబెంజ్యా, పశ్చిమ దేశాలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చే విధ్వంసక మార్గాన్ని ఎంచుకున్నాయని విమర్శించారు.

మరోవైపు, వచ్చే వారం న్యూయార్క్‌లో జరిగే ఐరాస సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యే ఇరాన్ 'కోర్ ప్రతినిధి బృందానికి' వీసాలు మంజూరు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ బృందంలో ఉన్నారని అమెరికా అధికారులు చెప్పారు.

పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ వరుసగా రెండో ఏడాది వీడియో ద్వారా సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు అనుమతిస్తూ ఐరాస సర్వసభ్య సభ గురువారం ఓటింగ్ ద్వారా నిర్ణయించింది. ఓటింగ్‌కు ముందు అమెరికా డిప్యూటీ రాయబారి టామీ బ్రూస్, పాలస్తీనా అథారిటీ తమను భాగస్వామిగా చూడాలంటే ఉగ్రవాదానికి ఆర్థిక సాయం ఆపాలని వ్యాఖ్యానించారు.