సియోల్, సెప్టెంబర్ 18: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మద్దతుగా తమ దేశం సైన్యాన్ని కానీ, సైనిక సామగ్రిని కానీ పంపబోదని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ శుక్రవారం స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

సోమాలియా తీరంలో సముద్రపు దొంగల నిరోధక విధుల్లో ఉన్న దక్షిణ కొరియా నౌకాదళ డిస్ట్రాయర్, దాని సహాయక నౌకల కార్యకలాప పరిధిని విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నామని లీ తెలిపారు. అయితే ఆ నౌకల ప్రధాన లక్ష్యం దక్షిణ కొరియా చమురు ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకల రక్షణే అవుతుందన్నారు.

మరోవైపు, ఇరాన్ యుద్ధం విషయంలో తాము 'కీలక దశ'కు చేరుకున్నామని, యుద్ధాన్ని ముగించే ప్రయత్నంలో మళ్లీ దాడులు ప్రారంభించాలా వద్దా అనేది నిర్ణయించాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం 'ఆక్సియోస్' వార్తా సంస్థకు చెప్పారు. ఈ నిర్ణయాన్ని అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు తీసుకుంటారా, తర్వాత తీసుకుంటారా అన్నది ఆయన చెప్పలేదు.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది.