రియాద్, అక్టోబర్ 18 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఇరాన్ మద్దతున్న యెమెన్ హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేస్తున్నారు. సౌదీలోని నజ్రాన్ ప్రాంతంలో ఆదివారం ఓ ప్రక్షేపకం పడటంతో ఆరుగురు గాయపడ్డారని సౌదీ పౌర రక్షణ విభాగం తెలిపింది. ఇళ్లు, వాహనాలకు నష్టం వాటిల్లింది.
నజ్రాన్ వద్ద సౌదీ హెలికాప్టర్ కూలి ఇద్దరు సిబ్బంది మృతి చెందారని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రకటించాయి. తాము అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేశామన్న హూతీల వాదనను సంకీర్ణ దళాలు ఖండించాయి. మరోవైపు ఉత్తర యెమెన్‌లోని సాదా ప్రాంతంలో సౌదీ వైమానిక దాడిలో తొమ్మిది మంది మృతి చెందారని, 16 మంది గాయపడ్డారని హూతీ మీడియా పేర్కొంది.
సౌదీ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈజిప్టు ప్రకటించింది. సౌదీకి మద్దతు ఇవ్వడంపై ఈజిప్టు పార్లమెంట్ సోమవారం చర్చలు కొనసాగించనుంది. హూతీల దాడులను గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) ఖండించి, సౌదీకి అండగా నిలుస్తామని ప్రకటించింది. హూతీలపై ఐక్యరాజ్యసమితి ఆయుధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరింది.