టెల్ అవీవ్, అక్టోబర్ 3: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడి చేసినప్పుడు కాక్‌పిట్ తలుపును ఎలా తెరిచానో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్లో వివరించారు. ప్రస్తుతం యూఏఈలో గాయాల నుంచి కోలుకుంటున్న ఆయనతో నెతన్యాహు మాట్లాడిన వివరాలను టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రచురించింది.
ఒమన్ పౌరుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ ప్రార్థన చేసుకోవాలని కోరారని, నాలుగైదు నిమిషాల తర్వాత తన తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగిలిందని, ఆ తర్వాత వరుసగా దెబ్బలు పడ్డాయని మచ్ఛర్ చెప్పారు. తొలుత విమానానికి భారీ నష్టం జరిగిందని అనుకున్నానని, తర్వాత దాడి చేస్తున్నది కాక్‌పిట్‌లోని మరో వ్యక్తేనని గ్రహించానని ఆయన వివరించారు.
బయటి నుంచి కోడ్ ద్వారా మాత్రమే తెరవగలిగే ఆ తలుపును లోపలి నుంచి నాబ్‌ను తిప్పి తెరవవచ్చని, బయట ఉన్న సిబ్బంది కోడ్ నమోదు చేయడానికి ప్రయత్నించినా కో-పైలట్ అడ్డుకున్నాడని ఆయన తెలిపారు. తనలో ఇంకా ఒక్క పోరాటం మిగిలే ఉందనే భావనతో తలుపు వద్దకు వెళ్లి, నాబ్‌ను వేగంగా తిప్పి తెరిచానని, అక్కడ సిద్ధంగా ఉన్న ప్రయాణికులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
మచ్ఛర్‌ను నెతన్యాహు భారత, ఇజ్రాయెల్ ప్రజల వీరుడిగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ తదుపరి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జ్యోతి వెలిగించేందుకు మచ్ఛర్‌ను, ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. అయితే జ్యోతి వెలిగించే వారిని ప్రజా సలహా కమిటీ ద్వారా ఎంపిక చేసి మంత్రివర్గ ప్రక్రియలో ఆమోదిస్తారని, నెతన్యాహు ఒక్కరే నిర్ణయించలేరని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.
ఆసుపత్రిలో మచ్ఛర్‌ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాని షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ పరామర్శించి, ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. అంతకుముందు శుక్రవారం ప్రధాని మోదీ వీడియో కాల్ ద్వారా మచ్ఛర్‌తో మాట్లాడారు.