స్ట్రాస్‌బర్గ్ (ఫ్రాన్స్), సెప్టెంబర్ 17: ఐరోపా సమాఖ్య (EU) 27 దేశాల కూటమిలో కెనడాను తన తొలి "అసోసియేట్ సభ్యదేశం"గా చేర్చుకునే అవకాశంపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ బుధవారం ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ఒత్తిడి నేపథ్యంలో ఒట్టావాను బ్రస్సెల్స్కు మరింత దగ్గర చేసే దిశగా ఈ ప్రతిపాదన వచ్చింది.
యూరోపియన్ పార్లమెంట్లో తన వార్షిక 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగంలో వాన్ డెర్ లేయన్ ఈ ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా సభలో పాల్గొన్నారు. ప్రసంగం అనంతరం కార్నీ లేచి వాన్ డెర్ లేయన్‌ను సాదరంగా కౌగిలించుకోవడం విశేషంగా నిలిచింది.
ప్రజాస్వామ్య దేశాలు అంతర్జాతీయ నియమ ఆధారిత వ్యవస్థలో చీలికను ఎదుర్కొంటున్న తరుణంలో బ్రస్సెల్స్, ఒట్టావా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వాన్ డెర్ లేయన్ పేర్కొన్నారు. వాణిజ్య సంబంధాల నుంచి విస్తృతమైన భవిష్యత్ కూటమిగా ఈ బంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆమె అభిప్రాయపడ్డారు. తయారీ, కృత్రిమ మేధ (AI), కీలక ఖనిజాలు, ఇంధనం, రక్షణ ఉత్పత్తి, ఆర్కిటిక్ ప్రాంతం, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించనున్నట్టు ఆమె వెల్లడించారు.
అంతకుముందు ఈ వారమే కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఈయూతో పూర్తి సభ్యత్వం కాకుండా ప్రత్యేక కూటమి కావాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. కెనడా ఎగుమతుల్లో దాదాపు 70 శాతం అమెరికాకే వెళ్తుండగా, ఈ ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఐరోపాతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలని కార్నీ ప్రభుత్వం భావిస్తోంది.
ఈయూ-కెనడా మధ్య ఇప్పటికే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) అమల్లో ఉంది. దీని పరిధిని విస్తరించి, ఉమ్మడి శ్రేయస్సు, ఆర్థిక భద్రతా వ్యవస్థగా తీర్చిదిద్దాలని వాన్ డెర్ లేయన్ సూచించారు. ఈ ఏడాది ప్రారంభంలో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఉక్రెయిన్ కోసం 'అసోసియేట్ సభ్యత్వం' అనే భావనను తొలిసారి ప్రతిపాదించగా, అది కీవ్‌లో అంతగా ఆదరణ పొందలేదు. ఈయూ ఒప్పందాల్లో ప్రస్తుతం 'అసోసియేట్ సభ్యత్వం' అనే ప్రత్యేక హోదాకు నిబంధనలు లేకపోవడంతో, ఇది ఎలా అమలవుతుందనే వివరాలను వాన్ డెర్ లేయన్ వెల్లడించలేదు.
ఈ ఏడాది కెనడా, ఐరోపా సమాఖ్య 150 బిలియన్ యూరోల (సుమారు 173 బిలియన్ డాలర్లు) రక్షణ కార్యక్రమం 'సేఫ్ (SAFE)'లో చేరిన తొలి యూరోపేతర దేశంగా నిలిచింది. దీంతో కెనడా కంపెనీలకు ఈయూ సంయుక్త సేకరణ కార్యక్రమాల్లో ప్రవేశం లభించింది.
