కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం నాడు ప్రభుత్వ విప్ అశోక్‌తో కలసి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
కంచిలి మండలం పోలేరు పంచాయతీ పరిధిలో రూ.1.31 కోట్లతో రెండు బీటీ రోడ్ల ప్రారంభోత్సవం, ఇచ్ఛాపురం రాజావారి మైదానంలో కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధులు రూ.2.29 కోట్లతో బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ శంకుస్థాపన, ఇచ్ఛాపురం మున్సిపాల్టీ పరిధిలో సుమారు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో రెండు ఆర్యూబీల శంకుస్థాపన, కవిటి మండలం భైరిపురంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ప్రారంభోత్సవం, రాజపురంలో రూ.20 లక్షల నిధులతో సామాజిక భవనానికి శంకుస్థాపన వంటి కార్యక్రమాలను రామ్మోహన్ నాయుడు నిర్వహించారు.
కంచిలి మండలం గుండం గ్రామంలో 41 కుటుంబాలకు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా
సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ప్రజలకు చేరువ చేస్తూ వారి అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలో ఉన్న కారణంగానే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు. మౌలిక వసతులను మరింత విస్తృతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
