దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలోగా వందశాతం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జలసౌధలో దేవాదుల ప్రాజెక్టుపై జరిగిన సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రాజెక్టు పనులను ప్రారంభం నుంచి ముగింపు వరకు సమగ్రంగా సమీక్షించి, ఎక్కడ పనులు నిలిచిపోయాయి, అందుకు కారణాలేంటి, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలను పాయింట్వారీగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
సమస్యను గుర్తించకుండా పనులు పూర్తవుతాయి అంటూ కాలయాపన చేయడం సరికాదని, ప్రతి సమస్యకు స్పష్టమైన పరిష్కారం, బాధ్యత, గడువు నిర్ణయించాలని అధికారులకు సూచించారు.
భూసేకరణ, అనుమతులు, నిర్మాణ పనులు, నిధులు, కాంట్రాక్టు ఏజెన్సీలకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం, అధికారులు, ఇంజినీర్లు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉన్న అధికారులతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సమగ్ర సమీక్ష నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
సమస్య ఎక్కడ ఉందో ముందుగా గుర్తించాలని, కారణాన్ని విశ్లేషించాలని, పరిష్కారాన్ని ఖరారు చేసి అమలు చేయాలని, ఫలితం వచ్చే వరకు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి అన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి విషయంలో ఎలాంటి కాలయాపనకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.
