కోల్‌కతా, అక్టోబర్ 19 (ఎక్స్‌ప్రెస్ టుడే): భారత నౌకాదళం కోసం గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) నిర్మిస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ (ఎన్‌జీఓపీవీ) 'శ్రేయస్' (యార్డ్ 3040)ను అక్టోబర్ 10న కోల్‌కతాలో జలప్రవేశం చేయించారు.

నౌకాదళ ఉప ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ సమక్షంలో ఆయన సతీమణి రేమన్ కొచ్చర్ ఈ నౌకను ప్రారంభించారు. నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ, జీఆర్ఎస్ఈ, పరిశ్రమ భాగస్వాముల సీనియర్ ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు. సంస్కృతంలో 'శ్రేయస్' అంటే 'అత్యుత్తమం' అని అర్థమని నౌకాదళం తెలిపింది.

ఐదు నెలల్లో మూడో నౌక

జీఆర్ఎస్ఈ నిర్మిస్తున్న నాలుగు ఎన్‌జీఓపీవీల్లో ఇది మూడోది. మొదటి నౌక 'సంఘమిత్ర'ను మే 20న, రెండోది 'శ్రుతి'ని ఆగస్టు 11న జలప్రవేశం చేయించారు. మొత్తం 11 నౌకల ఎన్‌జీఓపీవీ కార్యక్రమానికి 2023 మార్చిలో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో ఏడు నౌకలను గోవా షిప్‌యార్డ్ (జీఎస్ఎల్), నాలుగింటిని జీఆర్ఎస్ఈ నిర్మిస్తున్నాయి.

నౌక ప్రత్యేకతలు

స్వదేశంలో రూపకల్పన చేసి నిర్మిస్తున్న ఈ నౌకలు ప్రస్తుత ఓపీవీలు, ఎన్ఓపీవీల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. సముద్ర నిఘా, గాలింపు–రక్షణ చర్యలు, సముద్రంలోని చమురు క్షేత్రాల వంటి ఆస్తుల రక్షణ, మానవతా సహాయం–విపత్తు సహాయ చర్యలు, సముద్రదొంగల నిరోధం వంటి బహుళ రంగ కార్యకలాపాలకు వీటిని వినియోగిస్తారు. జీఆర్ఎస్ఈ నిర్మించే ప్రతి నౌక సుమారు 113 మీటర్ల పొడవు, సుమారు 3,000 టన్నుల డిస్‌ప్లేస్‌మెంట్, 23 నాట్ల గరిష్ఠ వేగం కలిగి ఉంటుందని, 14 నాట్ల వేగంతో 8,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదని ఒక అంతర్జాతీయ నౌకా వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ నౌక జలప్రవేశం 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యాలకు అనుగుణమైన స్వదేశీ నౌకా నిర్మాణంలో మరో ముందడుగని నౌకాదళం పేర్కొంది.