మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల ఫలితంగా భారత్ రక్షణ ఎగుమతుల్లో అద్భుత పురోగతి సాధించింది. గత 12 ఏళ్లలో రక్షణ ఎగుమతులు ఏకంగా 56 రెట్లు వృద్ధి చెందాయని, ప్రస్తుతం దేశం 83 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

  • 12 ఏళ్లలో రక్షణ ఎగుమతుల్లో 56 రెట్లు వృద్ధి
  • ప్రస్తుతం 83 దేశాలకు రక్షణ పరికరాల ఎగుమతి
  • మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల ఫలితంగా వృద్ధి
  • 2029-30 నాటికి రూ.50 వేల కోట్ల ఎగుమతుల లక్ష్యం

2014లో కేవలం రూ.1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ప్రస్తుతం రూ.24,000 కోట్లకు పైగా చేరుకున్నాయని అధికారులు తెలిపారు. 2029-30 నాటికి రూ.50,000 కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.

ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచేందుకు డీఆర్‌డీవో సాంకేతికతలను దేశీయ పరిశ్రమలకు బదిలీ చేస్తున్నట్లు, ఇప్పటివరకు 2,200కుపైగా సాంకేతికతలను పరిశ్రమలకు అందించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. దేశీయ రక్షణ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు దోహదపడుతున్నాయని పేర్కొంది.