ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం దేవరియా జిల్లాలో రూ.305 కోట్ల విలువైన 80 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు, శంకుస్థాపనలు చేశారు. ఆరోగ్యం, రవాణా, విద్య, శాంతిభద్రతల్లో సాధించిన పురోగతితో యూపీకి ఉన్న 'బీమారు' రాష్ట్రం ముద్ర పూర్తిగా చెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.
మెదడువాపు వ్యాధి (ఎన్సెఫలైటిస్) కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదని, గత సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రంలో నడిచిన మాఫియా పాలనను తమ ప్రభుత్వం పూర్తిగా అణచివేసిందని పేర్కొన్నారు.
ఆగస్టు 26న ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రస్తావించిన యోగి, ఈ పథకం అమల్లోకి వచ్చాక సమాజ్వాదీ నేతలు అకస్మాత్తుగా చురుగ్గా మారారని ఎద్దేవా చేశారు.
2027లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందని దేవరియా బహిరంగసభలో సీఎం స్పష్టం చేశారు.
