పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల త్వరిత పరిష్కారం, సుపరిపాలనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయడం దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే అమలు చేస్తున్నామని, దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని సీఎం తెలిపారు.

అమరావతి, ఆగస్టు 28: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు నేరుగా పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు, యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్టనర్లతో సీఎం మాట్లాడారు.

నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని చెప్పిన సీఎం, రూపొందించుకున్న కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లకు అనుగుణంగా ఆయా రంగాల్లో వృద్ధి నమోదు చేసేలా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్టనర్లు, స్వర్ణ కార్యాలయాల సిబ్బంది వినూత్నంగా ఆలోచించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, స్థానికంగా ఉండే వనరుల లభ్యతను ఆధారంగా చేసుకుని ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

డేటా లేక్, టెక్నాలజీ వినియోగంపై దిశానిర్దేశం

రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నియోజక వర్గాల విజన్‌ను అందించిందని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం సూచించారు. వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు డేటా లేక్ సిద్ధం చేసినట్టు తెలిపిన ఆయన, అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ అమలుపై ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టాలని, క్షేత్ర స్థాయి సమీక్షలు మొక్కుబడిగా కాకుండా ప్రజలకు పూర్తిగా జవాబుదారీగా ఉండేలా నిర్వహించాలని సూచించారు.

లబ్ధిదారులకు కేవలం నగదు సాయం అందించడమే కాకుండా, వారిని ఆర్థికంగా నిలబెట్టి సాధికారత వైపు నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. పీ4 ప్రాజెక్టు ద్వారా పేదలకు అవసరమైన చేయూత అందిస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలోనూ తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అనుమతులు పొందుతున్న పరిశ్రమలు ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో గ్రౌండ్ అయ్యేలా ప్రజా ప్రతినిధులు, క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశించారు. ఉద్యోగుల సామర్థ్యం పెరిగేలా ఇప్పటికే 1.50 కోట్ల ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసుకున్నారని సీఎం వెల్లడించారు.

వినూత్నంగా ఆలోచించాలి... మెరుగైన సేవలు అందించాలి

ప్రస్తుత పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్య, వైద్యం భారంగా మారుతున్నాయని, ఈ ఇబ్బందుల నుంచి వారిని గట్టెక్కించేందుకే సంజీవని, తల్లికి వందనం వంటి వినూత్న పథకాలు తెచ్చామని సీఎం వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలు పెంచడం వల్ల అదనంగా లక్ష మంది విద్యార్థులు చేరారని, ఇది వారి కుటుంబాలపై విద్యా భారాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు సాంప్రదాయ ధోరణి వీడి వినూత్నంగా ఆలోచించాలని, పరిపాలనలో వారి సమన్వయం అత్యంత కీలకమని, అన్ని స్థాయిల్లో పొలిటికల్ గవర్నెన్స్ సమర్థవంతంగా అమలు కావాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్ణయాల్లోనూ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే అద్భుత ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలల సాకారంగా చేపట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, 'ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు' కార్యక్రమంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారం చేపట్టారని గుర్తు చేశారు. యువతకు, నిరుద్యోగులకు మేలు చేసేలా చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియకు అనేక అడ్డంకులు ఎదురైనా సమర్థవంతంగా నిర్వహించి రిక్రూట్‌మెంట్ పూర్తి చేశామని, పారదర్శకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై విమర్శలు వచ్చినా టీచర్లే స్వయంగా ఉద్యమించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజలను మెప్పించగలిగితే ప్రజల నుంచి సహకారం కూడా అదే స్థాయిలో ఉంటుందని సీఎం చెప్పారు.

ఈ సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, ఏపీఎస్‌డీపీఎస్ ఈడీ వీఆర్ అలపర్తి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.