30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు నెరవేరిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తన భావాలను వ్యక్తం చేశారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్టు వెల్లడించిన సీఎం, 1996లో తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఫొటోను జత చేస్తూ ట్వీట్ చేశారు.
అమరావతి: ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నామని సీఎం పేర్కొన్నారు. తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేశానని, మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును తన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేయనున్నట్టు, ఈ చారిత్రక ఘట్టానికి ఆగస్టు 31వ తేదీ మార్కాపురం జిల్లా వేదిక కాబోతోందని సీఎం తెలిపారు. ఫేజ్-1తో 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు లక్షలాది మందికి తాగునీటితో తరతరాలుగా కరువుతో పోరాడిన ప్రజలకు ఉపశమనం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ వెలుగుల దండ అవుతుందని, నెర్రలు బారిన నేలను కృష్ణా జలాలతో తడపబోతున్నామని అన్నారు.
పశ్చిమ ప్రకాశం ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చామని, ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తున్నామని, బెంగుళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టులతో ఈ ప్రాంత వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తున్నామని వివరించారు.
"ప్రతి రైతు పొలానికి నీరు... ప్రతి యువకుడికి ఉపాధి... ప్రతి కుటుంబానికి భరోసా... ఇదే 'సీబీఎన్ అనే నేను' సంకల్పం" అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి పౌరుడూ అనే నేను స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
