ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి విచారణ వేగంగా జరిపి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా కోర్టుల్లో పరిష్కరించేలా చూడాలని, ప్రత్యేక సెషన్ కోర్టులు, స్పెషల్ కోర్టుల్లో కేసులను రేషనలైజ్ చేసి పరిష్కరించాలని సీఎం సూచించారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా, తప్పు చేసిన వారికి శిక్షపడేలా వ్యవస్థ పనిచేయాలని స్పష్టం చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి అత్యున్నత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల రక్షణ, సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్యారోగ్యం తదితర అంశాలపై సీఎం కీలక సూచనలు చేశారు.

గుంటూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదైన అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కేసుల సంఖ్యతో పాటు వాటి స్వభావం, కారణాలు, పరిష్కారానికి పడుతున్న సమయం వంటి అంశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. బాధితులకు అందుతున్న పరిహారం సద్వినియోగం అయ్యేలా చర్యలు చేపట్టాలని, పరిహారంతో పాటు హౌసింగ్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా బాధితులకు త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన సమావేశాలు ఇంకా 131 పెండింగ్‌లో ఉండటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా ఈ సమావేశాలను నిర్వహించాలని స్పష్టం చేశారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక వెలువడి రెండున్నర దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో అప్పటి పరిస్థితులు, ప్రస్తుతం వచ్చిన మార్పులను సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల్లో ఆర్థిక సాధికారత కల్పించడంతో పాటు ఆత్మవిశ్వాసం పెంచేలా అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని విద్యార్థుల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారిని ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందే స్థాయికి తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుతున్న హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చడం వల్ల మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కార్యక్రమాలు చేపట్టాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ వంటి వాణిజ్య పంటలు, అటవీ ఉత్పత్తుల ద్వారా గిరిజనుల ఆదాయాలను పెంచే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో అవకాశాలు లేక కాదు.. అవగాహన లేక మాత్రమే వెనుకబాటుతనం ఉంటోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ఎస్సీ,ఎస్టీ హాస్టళ్లలో టీచర్లు నివాసం ఉండేలా చూడాలని ఎమ్మెల్యే కొండ్రు మురళి, హరిజన వాడ అనే పేర్లను మార్చాలని పూతలపట్టు శాసనసభ్యుడు మురళీమోహన్ సీఎం దృష్టికి తీసుకురాగా, తక్షణమే చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. గిరిజనులు ట్రైకార్ రుణాలను పెంచాలన్న అభ్యర్థనపైనా సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశానికి మంత్రులు డీబీవీ స్వామి, వి.అనిత, జి. సంధ్యారాణి, ఎంపీలు కృష్ణప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్ సహా రాష్ట్ర వ్యాప్త ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల శాసనసభ్యులు, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.