నూజివీడు, ఆగస్టు 24: రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడించే ప్రక్రియను చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పిలుపునిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరి సంపద సృష్టికి ఆస్కారం ఉంటుందని, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
- ఏలూరు జిల్లా ముసునూరు వద్ద గార్మె పాప్ కార్నికా నాన్-జీఎంఓ ప్రాసెసింగ్ యూనిట్ ఆవిష్కరణ
- 17,500 మంది రైతులతో 40 వేల ఎకరాల్లో నాన్ జీఎంఓ హైబ్రీడ్ మొక్కజొన్న సాగు
- ఆంధ్రా పాప్ కార్న్, అరకు కాఫీకి రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు యోచన
- రాష్ట్రంలో ప్రస్తుతం 10 శాతమే ప్రాసెసింగ్ — పెంచాలని పిలుపు
ఏలూరు జిల్లా ముసునూరు వద్ద గార్మె పాప్ కార్నికా సంస్థ ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద జన్యుమార్పిడి కాని (నాన్-జీఎంఓ) ఎక్స్‌పాండబుల్ పాప్ కార్న్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. దేశీయ రకం హైబ్రీడ్ పాప్ కార్న్ మొక్కజొన్న విత్తనాలను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతులపై ఉన్న అభిమానంతో ఉపరాష్ట్రపతి ఏలూరు జిల్లాకు వచ్చి, జన్యుమార్పిడి జరగని మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించారని తెలిపారు.
నూజివీడు గడ్డ నుంచే పండే పాప్ కార్న్ మొక్కజొన్న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతోందని, గార్మె పాప్ కార్న్ దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న్ ఉత్పత్తి సంస్థగా అవతరించిందని సీఎం అభినందించారు. 17,500 మంది రైతులతో 40 వేల ఎకరాల్లో నాన్-జీఎంఓ హైబ్రీడ్ మొక్కజొన్నను ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థ, దేశవ్యాప్త పాప్ కార్న్ ఉత్పత్తిలో 70 శాతం వాటాను కలిగి ఉందని పేర్కొన్నారు. యాంత్రీకరణ, విత్తనాలు, సాగులో సాంకేతికత, రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు వరకూ అంతా వ్యవస్థీకృతంగా ఉన్నాయని, ఇప్పటివరకూ కొనుగోలు చేసిన పాప్ కార్న్‌లో పెద్ద ఎత్తున బ్రెజిల్ సహా ఇతర దేశాలకు వెళ్లిందని, ఇక నుంచి ఈ సంపద దేశంలోనే ఉంటుందని చెప్పారు.
ఆసియా మార్కెట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్‌కు కూడా పాప్ కార్న్ ఎగుమతి కావాలని, ఆంధ్రా పాప్ కార్న్, అరకు కాఫీ తాగేలా రైల్వే స్టేషన్లలోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని సీఎం ప్రకటించారు. కొండవీటి కొయ్య బొమ్మలు వంటి స్వదేశీ ఉత్పత్తులు కూడా ప్రపంచ మార్కెట్లకు వెళ్లాలని, పసుపు, మిరప, మొక్కజొన్న, ఆక్వా తదితర ఉత్పత్తులు ఓ మంచి బ్రాండ్‌తో అంతర్జాతీయ మార్కెట్‌కు చేరాలని పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా, రైతులను ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తున్నాయని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న దానిలో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్ చేయగలుగుతున్నామని, ప్రాసెసింగ్‌ను పెంచితే అధిక సంపద ఆర్జించే అవకాశం ఉంటుందని, ప్రత్యేకించి యువత ఈ రంగంపై దృష్టి పెట్టాలని, ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలని సీఎం సూచించారు. నూజివీడు వద్ద పామాయిల్, కోకో, ఆక్వా వంటి వాణిజ్య పంటలు పెరిగాయని, రాయలసీమను కూడా ఉద్యాన పంటల హబ్‌గా మార్చే దిశగా రూ.1 లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.35 వేల కోట్లతో 36 సాగు ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి పంటలను కాపాడామని వివరించారు.
చింతలపూడి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత భవిష్యత్తు మారుతుందని, వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులోనే ప్రారంభించి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీరు ఇస్తామని సీఎం తెలిపారు. ఎల్‌నినో వల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున పప్పు ధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చర్యలు చేపట్టామని, రైతులు సహకరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గోదావరి–కృష్ణా, తుంగభద్ర, పెన్నా–కావేరీ నదుల అనుసంధానం ద్వారా నాలుగు రాష్ట్రాల్లో సమస్య పరిష్కారమవుతుందని, గంగా, మహానది, గోదావరి నదులను కూడా అనుసంధానిస్తే వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవచ్చని, నీటి భద్రత సాధిస్తే దేశాభివృద్ధి 'అన్‌స్టాపబుల్' అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, కె. అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి తదితరులు హాజరయ్యారు.
