రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల చాలా భూములు వివాదాల్లోకి వెళ్లాయని, ఈ వివాదాలను పరిష్కరించడంతోపాటు శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు.
దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 232 సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్న భూ వివాదాలను క్లియర్ చేశామని, వీటి విలువ సుమారు రూ.5 వేల కోట్లు ఉంటాయని, మొత్తంగా సుదీర్ఘంగా వివాదంలో ఉన్న 31 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని సీఎం చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
120 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం: వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అంబాజీపేటలో గ్రౌండ్ రెంట్ భూముల అంశం 120 ఏళ్ల కాలం నాటి సమస్య అని, అలాంటి సమస్యను పరిష్కరించగలిగామని గుర్తు చేశారు. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారాల్లో ఎక్కడా అవినీతి లేకుండా భూ సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. మంత్రులు, అధికారులు కూడా ఈ సమస్యల్ని పరిష్కరించిన విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రీసర్వే ప్రక్రియ పూర్తైన భూములకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని, నవంబరు 1 తేదీ నుంచి రియల్ టైమ్‌లో ఇంటిగ్రేషన్ చేయాలని ఆదేశించారు.
నిరంతరాయంగా నైపుణ్యాభివృద్ధి: రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో యువత ఉంటారని, యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించటం నిరంతర ప్రక్రియ అని సీఎం అన్నారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకూ విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని, పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులతోనూ ఈ నైపుణ్యాలను కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఏపీకి వచ్చే పరిశ్రమల్లో నైపుణ్యం ఉన్న స్థానిక యువతే ఉద్యోగాలు పొందేలా కార్యాచరణ చేపట్టాలని, నియోజకవర్గాల వారీగా జాబ్ ఫెయిర్లు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ 4.98 లక్షల మంది యువత నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు పరిశ్రమల్ని కూడా అనుసంధానించి అవసరమైన నైపుణ్యాలను పొందేలా చూడాలని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనా విద్యార్థులకు నైపుణ్యం సాధించేలా చూడాలని సూచించారు.
2027 నాటికి వందశాతం అక్షరాస్యత: 2027 నాటికి అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా వందశాతం అక్షరాస్యతను సాధించాలని, స్కూల్ బిల్డింగ్ సేఫ్టీపై ఆడిటింగ్ నిర్వహించి వాటిని సురక్షితంగా మార్చేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. లిటరేట్ లెర్న్డ్ స్టేట్‌గా ఏపీ మారాలని పేర్కొన్నారు. స్వచ్ఛవాయు సర్వేక్షణ్‌లో గుంటూరుకు జాతీయ స్థాయిలో రెండో స్థానం లభించిందని, నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీస్‌గా గుంటూరు, విజయవాడలోని వార్డులకు అవార్డులు వచ్చాయని తెలిపారు. రూ.1.05 కోట్ల నగదు ప్రోత్సాహంతో పాటు జాతీయ స్థాయిలో 5 అవార్డులు ఈ ఏడాది ఏపీలోని నగరాలు దక్కించుకున్నాయని, గుంటూరు, ఏలూరు, విజయనగరం, విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు నగరాల్లో అత్యుత్తమ పని తీరు ఉందని చెప్పారు. ప్రతీ నెలా ఒక రోజు సంజీవని కార్యక్రమం ద్వారా వైద్యారోగ్య పరిరక్షణపై క్షేత్రస్థాయికి వెళ్తున్నానని, టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
పీఎం సూర్యఘర్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్లు సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. సూర్యఘర్ పథకం ద్వారా ఎంత ఎక్కువ ఇన్స్టలేషన్లు జరిగితే విద్యుత్ ఉత్పత్తిపై అంత ఒత్తిడి తగ్గుతుందని, కేంద్రం అందిస్తున్న ఈ పథకం ద్వారా వచ్చే సబ్సిడీలను ప్రజలకు అందేలా చేయాలని సూచించారు. పీఎం కుసుమ్ కింద కూడా వ్యవసాయ కనెక్షన్లకు సౌరవిద్యుత్ ఏర్పాటు చేయాలని, పాఠశాల భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 28 జిల్లాల్లో 2932 భవనాలపై 47 మెగావాట్ల సోలార్ రూఫ్ టాప్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని, జిల్లాల కలెక్టర్లు ఇంటింటికీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సహకరించాలని సూచించారు.
విద్యుత్ కొనుగోలు ధరలో ఆదా: విద్యుత్ డిమాండ్‌ను తీర్చేలా పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సహా వివిధ ప్రత్యామ్నాయాలకు వెళ్తున్నామని, ప్రతీ ఇంటిపైనా విద్యుత్ ఉత్పత్తి జరిగితే సరఫరా, పంపిణీ నష్టాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. 2025-26 ఏడాదిలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్‌కు రూ.4.97కి తగ్గించామని, ప్రతీ యూనిట్‌కు రూ.0.23 పైసల మేర పొదుపు చేయగలుగుతున్నామని తెలిపారు. గడచిన రెండేళ్లుగా విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి టారిఫ్ పెంచలేదని ఆయన స్పష్టం చేశారు.
