కుప్పం, సెప్టెంబరు 22: వాతావరణ అనుకూల (ఎన్విరానమెంటల్లీ కంట్రోల్డ్) పౌల్ట్రీ షెడ్లను కుప్పంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే అంశంపై స్థానిక పౌల్ట్రీ రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. కుప్పంలో పైలట్‌గా ఈసీ పౌల్ట్రీ షెడ్ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టినట్టు ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. రైతులను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలన్న లక్ష్యంతో ఐబీ గ్రూప్‌తో కలిసి ఈసీ పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదగాలన్న ఉద్దేశంతో కుప్పంలో పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేసేలా రియల్ టైమ్‌లో అన్ని అనుమతులు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని ప్రోత్సహించేలా ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకువచ్చినట్టు స్పష్టం చేసిన సీఎం, డైరీ, పౌల్ట్రీ, ఉద్యాన, సెరీ కల్చర్ రంగాలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజల్లో పెరుగుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రొటీన్ ఎక్కువగా ఉండే కోడిమాంసం, గుడ్ల వినియోగం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

కుప్పంలో ఉత్పత్తి చేసిన పౌల్ట్రీ ఉత్పత్తులను వేగంగా ఇతర ప్రాంతాలకు తరలించేలా రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచుతున్నట్టు సీఎం తెలిపారు. పెరిగిన కనెక్టివిటీతో కుప్పం బెంగుళూరుకు శాటిలైట్ టౌన్‌షిప్‌గా మారిపోయిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో కుప్పం నియోజకవర్గాన్ని వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు చిరునామాగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.