కుప్పం, సెప్టెంబరు 21: నారావారిపల్లె తనకు జన్మనిస్తే… కుప్పం రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పాన్ని మోడల్‌ నియోజకవర్గంగా, స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కుప్పంలో సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, రూ.327 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు.

హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీటిని తీసుకువచ్చి 133 చెరువులను నింపగలిగామని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని 550కుపైగా చిన్న నీటిపారుదల చెరువులను లిఫ్ట్‌ ఇరిగేషన్‌, పైప్‌లైన్లతో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. యామిగానిపల్లి, మనపల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. బీరువానిపల్లి వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా రూ.45 కోట్లతో రిజర్వాయర్‌ నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కృష్ణా, గోదావరి నదులకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడంతో నీటి లభ్యతపై ఒత్తిడి ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు అధికంగా రసాయన ఎరువులు వినియోగించకుండా ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ పంటలు, సూక్ష్మ సాగునీటి విధానాలపై దృష్టి పెట్టాలని, "ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష" అనే విధానంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచాలని చెప్పారు.

ప్రతి ఇంటిపైనా సోలార్‌ రూఫ్‌టాప్‌

కుప్పాన్ని నెట్‌జీరో నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి ఇంటిపైనా సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసి ప్రతి ఇల్లూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంగా మారేలా చర్యలు చేపడతామని చెప్పారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన పీఎం-కుసుమ్‌ సోలార్‌ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. కుప్పంలో 8,904 బంగారు కుటుంబాలను గుర్తించి పీ4 కార్యక్రమం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని, టీవీఎస్‌, అదానీ, మెగా తదితర సంస్థలు 8,900కుపైగా కుటుంబాలను దత్తత తీసుకున్నాయని తెలిపారు. కుప్పంలో ఇప్పటికే 32 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు లభించేలా బిర్లా ఇన్‌స్టిట్యూట్‌, మానస సరోవర్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.

కుప్పం అభివృద్ధికి భారీ ప్రణాళిక

రెండు నెలల క్రితం కుప్పంలో రూ.7,939 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని సీఎం గుర్తుచేశారు. తాజాగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రూ.38 కోట్ల విలువైన ప్రభుత్వ పనులకు, మరో రూ.289 కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమిపూజ, శంకుస్థాపన చేశారు. 82 ప్రాసెసింగ్‌ కేంద్రాల ద్వారా చెత్త నుంచి కంపోస్టు తయారు చేస్తున్నామని చెప్తూ, రూ.3.30 కోట్లతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌, మెటీరియల్‌ రికవరీ సెంటర్‌ను ప్రారంభించారు. రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాలకు, పది ఎకరాల్లో రూ.2.70 కోట్లతో మల్లనూరు జూనియర్‌ కళాశాల పనులకు, కుప్పం మార్కెట్‌ యార్డులో రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. హైమాస్ట్‌ వీధి దీపాలు, పబ్లిక్‌ టాయిలెట్లు, అండర్‌గ్రౌండ్‌ యుటిలిటీ వ్యవస్థ, బీటీ, సీసీ రోడ్లతో పాటు ఆధునిక రైతు బజార్‌, హెరిటేజ్‌ గ్రానైట్‌ స్టోన్‌ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

కుప్పం కనెక్టివిటీకి పెద్దపీట

కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్‌-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచేలా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆ సౌకర్యాన్ని కల్పించామని సీఎం తెలిపారు. బెంగళూరు, చెన్నై, కేజీఎఫ్‌, కృష్ణగిరి ప్రాంతాలను అనుసంధానించేలా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందని, కుప్పం-పొగురుపల్లి నుంచి బెంగళూరుకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మిస్తున్నామని చెప్పారు. చిత్తూరు నుంచి కుప్పానికి బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గం కల్పించాలని రైల్వే శాఖ మంత్రిని కోరినట్లు, భవిష్యత్తులో కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా పౌరుల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని, 13 పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల ద్వారా 1.29 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ఇల్లు, ఇంటి స్థలం అందించేలా చర్యలు చేపడుతున్నామని, కంగుందిలో దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యను పరిష్కరించి 320 మందికి పట్టాలు అందించామని తెలిపారు.

ప్రజలతో ముఖాముఖి... అభివృద్ధిపై అభిప్రాయాలు

మహిళా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి రైతులు, గృహిణులు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. పీ4 కార్యక్రమం ద్వారా లభించిన ప్రయోజనాలపై లక్ష్మి అనే మహిళతో మాట్లాడగా, ఇటుకల బట్టీ ఏర్పాటు చేసుకునేందుకు సహకరించి తనను మహిళా పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దినందుకు సీఎంకు, టీవీఎస్‌ సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కుప్పంలోని ఓ పరిశ్రమలో ఉద్యోగం పొందిన సురేఖ అనే యువతిని ముఖ్యమంత్రి అభినందించారు. కుప్పం మెడికల్‌ కాలేజీ తన తండ్రి ప్రాణాలను కాపాడిందని యువ పారిశ్రామికవేత్త సుబ్రహ్మణ్యం తెలిపారు. హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో నీటి ప్రవాహాన్ని లైవ్‌ వీడియో ద్వారా సభకు చూపించారు. కుప్పం అభివృద్ధిపై కడా నిర్వహించిన వీడియో కాంటెస్టులో విజేతలైన సుబ్రహ్మణ్యం, విక్కీలను సీఎం సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, కుప్పం స్థానిక అధికారులు పాల్గొన్నారు.