వారణాసి, సెప్టెంబర్ 17: వారణాసి-వాద్‌నగర్ సేవాయాత్ర కార్యక్రమంలో భాగంగా వారణాసిలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ కాశీ విశ్వనాథ్ స్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పవిత్ర జలాభిషేకం, పండితుల ఆశీర్వచనం

శ్రీ కాశీ విశ్వనాథునికి పవిత్ర జలాలతో అభిషేకం చేసిన సీఎం చంద్రబాబుకు ఆలయ పండితుల ఆశీర్వచనం లభించింది. అర్చకులు సీఎంకు ప్రసాదాన్ని అందించారు. అనంతరం కేంద్ర మంత్రులు, యూపీ సీఎంతో కలిసి ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు సీఎం చంద్రబాబు ప్రసాదాన్ని పంచారు.

వారణాసి-వాద్‌నగర్ సేవాయాత్ర కార్యక్రమం

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో వాద్‌నగర్ సేవాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే శ్రీ కాశీ విశ్వనాథునికి సీఎం చంద్రబాబు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ కూడా పాల్గొన్నారు.