రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గృహ నిర్మాణ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, పీఎం జన్ మన్ సహా వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలోగా గ్రౌండింగ్ చేయాలని ఆదేశం
- పట్టణ ప్రాంతాల్లో 1.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచన
- డిసెంబరు 2026 నాటికి 2.05 లక్షలు, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశం
- కేంద్ర సహకారంతో వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక టౌన్‌షిప్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలు
పీఎంఏవై 1.0, పీఎంఏవై 2.0, పీఎం జన్ మన్ పథకాల కింద రాష్ట్రంలో 18.72 లక్షల ఇళ్ల మంజూరు కాగా, ఇప్పటి వరకూ 13.20 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 16.11 లక్షల ఇళ్లకు గానూ ఇప్పటికే 11.31 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందని, ఏపీ టిడ్కో పరిధిలో 2.61 లక్షల ఇళ్లకు గానూ 1.88 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని తెలిపారు. 2027 డిసెంబరు నాటికి 75 వేల కొత్త గృహాలను మంజూరు అయ్యేలా చూడటంతో పాటు 1.5 లక్షల ఇళ్లను పైప్లైన్లోకి తీసుకురావాలని, దీనికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన కేటాయింపులు పొందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఉచిత ఇళ్ల స్థలాలపై ప్రత్యేక కార్యాచరణ
ఇంటి స్థలాలు లేని కుటుంబాల వాస్తవ డిమాండ్‌ను గుర్తించేందుకు ఆర్టీజీఎస్ సహా ఆవాస్ ప్లస్, హౌసింగ్, రెవెన్యూ శాఖల నుంచి డేటాను అనుసంధానం చేసుకుని డూప్లికేషన్ లేకుండా అర్హులను గుర్తించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రాథమిక లబ్ధిదారుల జాబితాలను ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించి పారదర్శకంగా పరిష్కరించిన అనంతరం తుది జాబితాలను ఖరారు చేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న లే అవుట్లలో నిర్మాణాలు చేపట్టని భూమిని అవసరానికి అనుగుణంగా 2 లేదా 3 సెంట్ల ప్లాట్లుగా పునర్వ్యవస్థీకరించాలని నిర్దేశించారు. ఖాళీ స్థలాల గుర్తింపు, అర్హులైన లబ్ధిదారులకు మ్యాపింగ్, నిర్మాణం పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలోనూ సాచురేషన్ విధానంలో గృహ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, శాఖల మధ్య సమన్వయంతో అందరికీ ఇళ్లు లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
పారిశ్రామిక టౌన్‌షిప్‌ల నిర్మాణం
కేంద్ర సహకారంతో వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక టౌన్‌షిప్‌లను నిర్మించే అంశంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. రాష్ట్రంలోని శ్రీసిటీ సహా వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల ఏర్పాటు ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని ఈ టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, హౌసింగ్ శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
