విజయవాడ, సెప్టెంబర్ 12: వైద్యారోగ్య రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంజీవని అమలు చేయనున్నామని, వైద్యరంగంలో ఇది గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని చెప్పారు. జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని వెల్లడించారు.

  • జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌
  • వైద్యరంగంలో గేమ్‌ఛేంజర్‌గా సంజీవని రాష్ట్రవ్యాప్త అమలు
  • అమరావతిలో క్వాంటం బయో వ్యాలీకి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం
  • రూ.249 కోట్లతో 10 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులు, 12 ఐపీహెచ్‌ఎల్‌ల ప్రారంభం — 500 క్రిటికల్‌ కేర్‌ బెడ్లు అందుబాటులోకి

శనివారం వైద్యారోగ్య శాఖకు చెందిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీని ఇద్దరు నేతలు సందర్శించి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్‌ కళా వేదికలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీలను వర్చువల్‌గా లాంఛ్‌ చేశారు. వీటితో రాష్ట్రంలో 500 క్రిటికల్‌ కేర్‌ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు, అల్ట్రాసౌండ్‌ సదుపాయాలతో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయని, దీంతో అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుందని ప్రభుత్వం తెలిపింది.

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో వైద్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశంలో మెడికల్‌ సీట్లను 51 వేల నుంచి రెండింతలకుపైగా పెంచారని, కోవిడ్‌ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించిన ఘనత భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని, జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు మందులు, అభా కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఫార్మా రంగానికి ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా ఉందని, మెడ్‌టెక్‌ పార్కు ద్వారా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

వంటశాలను ఫార్మసీగా, ఆహారాన్నే ఔషధంగా భావించి ఆరోగ్య పద్ధతులను మార్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, సంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి నిధులు కేటాయిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం వల్లే ఇటువంటి అభివృద్ధి సాధ్యమవుతోందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని అందిస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామని గుర్తు చేశారు.

సాంకేతికతతో సత్వర ప్రగతి

సాంకేతికతను అన్ని రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తే రాబోయే పదేళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించగలదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్‌ సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, అక్కడ క్వాంటం బయో వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని, దీనికి జాతీయ గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్‌ అమరావతిలోనే ప్రారంభం కానుందని, ఇప్పుడు లద్దాఖ్‌లో సైతం అమరావతి గురించి చర్చించుకునే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఏఐ రంగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ప్రజాప్రతినిధులు కేశినేని శివనాథ్‌, బోండా ఉమ, సోము వీర్రాజు సహా వైద్యారోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కళావేదికలో సీఎం వేదికపైకి రాగానే వైద్య విద్యార్థులు, సభికులు పెద్దఎత్తున హర్షధ్వానాలతో స్వాగతం పలికగా, ప్రధాని మోదీ, అమరావతి, సంజీవని, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ సభికులు చప్పట్లతో స్పందించారు. సభ ముగిశాక వేదిక మీద నుంచే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి సీఎం చంద్రబాబు సెల్ఫీ తీసుకున్నారు.