ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అమరావతి, ఆగస్ట్ 25: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని సీఎం చెప్పారు. పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని, స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల్లో భాగంగా రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 పనులకు సంబంధించి పురోగతిపై సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని, పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే రూ.899 కోట్లు ఆర్థిక శాఖ కేటాయింపులు జరిగాయని అధికారులు తెలిపారు. వీటిలో పట్టణాభివృద్ధి, ఆర్ అండ్ బీ, జల వనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అత్యధిక పనులు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,869, పశ్చిమ గోదావరి జిల్లాలో 625, కోనసీమ జిల్లాలో 1,501, ఏలూరు జిల్లాలో 426, కాకినాడ జిల్లాలో 321, పోలవరం జిల్లాలో 190 పనులు చేపడుతున్నారు.

2027 పుష్కరాలకు భారీగా భక్తులు

2015 మహా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.86 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేయగా, 2027లో 8 నుంచి 10 కోట్ల మంది గోదావరి పుష్కరాలకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు సుమారు కోటి మంది పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉందని, రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఉన్న 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నారు.

టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి

గోదావరి పరివాహక ప్రాంతంలో పిఠాపురంలో శక్తి పీఠం సహా పంచారామాల్లో 4 క్షేత్రాలు, ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. హోం స్టేలను ప్రోత్సహించాలని, కొత్తగా హోటళ్ల నిర్మాణం చేపట్టేవారికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. రాజమహేంద్రవరంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని, దేశ విదేశాల్లో ప్రముఖులందరికీ పుష్కరాలకు ఆహ్వానం అందించాలని సూచించారు. పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ఏ రోడ్లపైనా గుంతలు కనిపించకూడదని, గోదావరిలో చుక్క కూడా మురుగు నీరు కలవకుండా చూడాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

రద్దీ నిర్వహణకు ఏఐ వినియోగం

భద్రత, రద్దీ నిర్వహణకు ఏఐ ఆధారిత క్రౌడ్ అనలిటిక్స్, సీసీటీవీ ఎంట్రీ-ఎగ్జిట్ మానిటరింగ్, డ్రోన్ సర్వైలెన్స్, క్యూఆర్ ఆధారిత వాహన గుర్తింపు వంటి సాంకేతికతలు వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 30 ఫీల్డ్ ఆస్పత్రులను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసి, అనుబంధంగా ల్యాబ్‌లు సిద్ధం చేస్తున్నారు. నదిలో భద్రత కోసం 2,697 రెస్క్యూ బోట్లు, 8,955 శిక్షణ పొందిన ఈతగాళ్లను నియమించనున్నారు. కాలుష్య రహిత పుష్కరాల కోసం 487 గ్రీన్ ఎనర్జీ బస్సులు వినియోగించనున్నారు.

మోడల్ పుష్కర పంచాయతీగా ముని కూడలి

గోదావరి నదీ పరివాహక జిల్లాల్లోని 260 గ్రామ పంచాయతీల్లో 50 గ్రామ పంచాయతీలను మోడల్ పుష్కర పంచాయతీలుగా అభివృద్ధి చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ముని కూడలిని పైలట్ మోడల్ పుష్కర పంచాయతీగా ఎంపిక చేశారు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉప నదులు కలుస్తున్నందున 'అఖండ గోదావరి' పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, వై సత్యకుమార్ యాదవ్, గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారి, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.