సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగాక స్పందించడం కాకుండా, ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించేలా ఎస్ఓపీని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, వేటకు వెళ్లేవారి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటేనే అత్యవసర సమయాల్లో సత్వర సాయం అందించగలమని సీఎం స్పష్టం చేశారు.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3న బోటులో వేటకు వెళ్లగా, పది రోజుల్లో తిరిగి వస్తామని చెప్పినట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే 16వ తేదీకి కూడా వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందిన వెంటనే కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు ప్రారంభించినట్టు అధికారులు సీఎంకు వివరించారు. బోటులో ట్రాన్స్‌పాండర్ ఏర్పాటు, బోటు ఒంటరిగా ఎందుకు వెళ్లింది, గల్లంతైన విషయం ఎప్పుడు తెలిసింది వంటి అంశాలపై సీఎం అధికారులను ప్రశ్నించి, గాలింపు పరిధిని మరింత విస్తృతం చేయాలని సూచించారు.
చెన్నైలోని కోస్ట్‌గార్డ్ హెడ్‌క్వార్టర్స్ ద్వారా అండమాన్, బంగ్లాదేశ్ అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్టు అధికారులు పేర్కొన్నారు. నేవీ డార్నియర్ విమానాల ద్వారా 216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు కొనసాగుతున్నట్టు వివరించారు.
వేటకు వెళ్లే మత్స్యకారులకు అందుతున్న సాంకేతిక సహాయం, రోజువారీ సమన్వయ వ్యవస్థలపైనా చంద్రబాబు సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
