సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం చిన్న కుటుంబాలుగా విడగొట్టుకోకుండా... భవిష్యత్తులో అన్ని పథకాలను ఫ్యామిలీ యూనిట్‌గానే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా సంక్షేమం ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబాల మ్యాపింగ్ చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులను యథాతథంగా కొనసాగిస్తూనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం సూచించారు. రేషన్, పెన్షన్ల కోసం కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోవడం సరికాదని, పెద్ద కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చి ఆ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఇదే ప్రభుత్వ విధానమని, దానికి అనుగుణంగానే పాలసీలు, కార్యాచరణ ఉండాలని 8వ కలెక్టర్ల సమావేశం రెండో రోజున శుక్రవారం సూపర్-6 పథకాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ సీఎం చంద్రబాబు వెల్లడించారు.
సంక్షేమం నుంచి కుటుంబ సాధికారత వైపు: కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించేలా చూడాలని సీఎం సూచించారు. సంక్షేమ పథకాల అమలులో కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని, వివిధ పథకాల్లో ఉన్న లోటుపాట్లను సరిచేసి అత్యుత్తమ విధానాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశామని, ఇందులో ఒక్క పెన్షన్లకే రూ.75 వేల కోట్లు వ్యయం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని, సంక్షేమం నుంచి కుటుంబాలను సాధికారత దిశగా తీసుకెళ్లే 'వెల్ఫేర్ టు ఎంపవరింగ్ ఫ్యామిలీస్' విధానంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్: సెర్ప్, మెప్మా ద్వారా 'వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్' కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. ఐదు లక్షల మంది మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టామని తెలిపారు. వివిధ సామాజిక వర్గాలను సాధికారత దిశగా తీసుకెళ్లి అందర్నీ అభివృద్ధి చేయాలని, హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మెరుగైన విద్య అందించాలని స్పష్టం చేశారు. పీ4 కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అసంపూర్తిగా ఉన్న కాపు కార్పొరేషన్ భవనాలను పూర్తి చేయాలని కూడా ఆదేశించారు.
నెలవారీ కార్యక్రమాలపై ఆదేశాలు: ప్రతి నెలా మొదటి తేదీని 'పేదల సేవలో' కార్యక్రమం ద్వారా సంక్షేమానికి కేటాయించామని, ప్రతి నెలా 9న 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమం ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సీఎం సూచించారు. మూడో శనివారం 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నాలుగో శనివారం పౌరుల ఆరోగ్య నిర్వహణ కోసం డిజిటల్ హెల్త్ రికార్డుల 'సంజీవని' కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు మంచి ఆలోచనలు, విలువలతో కూడిన సమాజ నిర్మాణం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మహిళలు, శిశువుల్లో రక్తహీనత వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, ఇదే 2047 విజన్‌లో కీలక లక్ష్యమని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని కూడా కలెక్టర్లను ఆదేశించారు.
యానాటి కొండ సామాజికవర్గానికి ఎస్టీ ప్రయోజనాలు: శ్రీకాకుళం జిల్లాలో యానాటి కొండ సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్‌ను కలెక్టర్ల కాన్ఫరెన్సులో మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. చాలా కాలంగా యానాటి కొండ సామాజిక వర్గం వాళ్లు తమను ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం, ఎస్టీల్లో చేర్చే అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని, ఈలోగా బుడగ జంగాల తరహాలో ఎస్టీలకు వర్తింపచేసే ప్రయోజనాలను యానాటి కొండ సామాజిక వర్గానికి అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు.
