వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసంలో విఘ్నేశ్వరుడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సతీమణి నారా భువనేశ్వరితో పాటు మనవడు సైతం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
- నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు
- గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక అని వ్యాఖ్య
- రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ప్రార్థన
- అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
పూజ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించామని, ఈ గణనాథుడి పూజ తనకు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక అని, ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయమని ఆయన అన్నారు.
విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు సమాజానికి సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయని, సమష్టితత్వాన్ని బోధిస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించేవి ధార్మిక కార్యక్రమాలేనని, ఇందులో వాడవాడలా మండపాలతో జరిగే వినాయక చవితి వేడుకలు మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు. మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా చవితి వేడుకలు కనిపిస్తాయని అభివర్ణించారు.
"వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి... ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించాను" అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తన సందేశాన్ని ముగించారు.
