అమరావతి, సెప్టెంబర్ 26: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్‌పై ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా చేసిన ప్రకటన అపోహలకు ముగింపు పలికిందని, ఉమ్మడి ప్రకటన ఈసీ విశ్వసనీయతను స్పష్టం చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
- ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్.ఎస్. సంధూ, వివేక్ జోషి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణపై సీఎం స్పందన
- రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను ఉమ్మడి ప్రకటన మరోసారి స్పష్టం చేసిందని వ్యాఖ్య
- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నెలకొన్న అపోహలకు తెరదించిందని పేర్కొన్న సీఎం
- స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని వ్యాఖ్య
- రాజ్యాంగ సంస్థలను గౌరవించడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యత అని పిలుపు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్. ఎస్. సంధూ, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ మన రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు ఈ ప్రకటన తెరదించిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమష్టిగా, సంస్థాగత విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారని ఆయన వివరించారు.
స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని సీఎం అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, బలమైన ప్రజాస్వామ్యంలో గెలుపును, ఓటమిని సమానంగా హుందాతనంతో స్వీకరించడం కూడా నాయకత్వ లక్షణమేనని పేర్కొన్నారు.
మన రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యమని, భారత ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు తన ట్వీట్లో పేర్కొన్నారు.
