రాష్ట్రంలో వైద్య మౌలిక వసతుల బలోపేతంలో భాగంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు (సీసీబీలు), 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను (ఐపీహెచ్ఎల్) శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సంయుక్తంగా ప్రారంభించారు.
విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22 ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటి కోసం రూ.249 కోట్లు వెచ్చించినట్టు ప్రభుత్వం తెలిపింది. క్రిటికల్ కేర్ బ్లాకులు, ఐపీహెచ్ఎల్లు అందుబాటులోకి రావడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు జిల్లా స్థాయిలోనే మెరుగైన అత్యవసర వైద్యం, ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు లభించనున్నాయి.
అందుబాటులోకి 500 క్రిటికల్ కేర్ బెడ్లు
కొత్తగా ప్రారంభమైన సీసీబీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 500 క్రిటికల్ కేర్ బెడ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సదుపాయంతో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు ఇకపై స్థానికంగానే లభిస్తాయి. దీనివల్ల అత్యాధునిక వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పనుంది. కేంద్రం మంజూరు చేసిన మొత్తం 26 ఐపీహెచ్ఎల్లలో ఇప్పటికే 14 పనిచేస్తుండగా, మిగిలిన 12 ల్యాబరేటరీలను శనివారం ప్రారంభించారు. వీటి ద్వారా మైక్రోబయాలజీ, హీమటాలజీ వంటి కీలక వైద్య పరీక్షలు జిల్లా స్థాయిలోనే అందుబాటులోకి వచ్చి, వివిధ వ్యాధులను ముందుగానే గుర్తించే వీలు కలుగుతుంది.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
ఉదయం 10:45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడకు బయలుదేరారు. 11:00 గంటలకు విజయవాడ పాత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (Old GGH)కు చేరుకున్న ఆయన, 11:00 నుంచి 11:25 గంటల మధ్య అక్కడ క్రిటికల్ కేర్ బ్లాక్, ఐపీహెచ్ఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 11:30 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికకు చేరుకున్న సీఎం, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి మధ్యాహ్నం 1:25 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాకులు, ఐపీహెచ్ ల్యాబరేటరీలను ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:40 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.
