అమరావతి, సెప్టెంబర్ 16: నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

  • హైరిస్క్ ఉద్యాన పంటల రక్షణకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కోసం రూ.190 కోట్ల కేటాయింపు
  • ధరల నియంత్రణకు అవసరమైన చోట్ల మార్కెట్ ఇంటర్వెన్షన్, కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల అమలుకు ఆదేశం
  • రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకుల సరఫరాకు సూచన
  • ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు ISSCA గ్లోబల్ అవార్డు-2026 దక్కడంపై అభినందనలు

ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను అంచనా వేయాలని సీఎం సూచించారు. ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గట్టు ఉందా, సరఫరా పరిస్థితులు ఎలా ఉన్నాయో విశ్లేషించుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి చోట్ల, ఏయే పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ అవసరమో గుర్తించాలని, ధరలు పెరగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు, రైతులను ఆయా పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ధరలను నియంత్రణ చేసేలా చూడాలని, అవసరమైతే రైతుల నుంచి బై బ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, రైతు బజార్లు, రేషన్ డిపోల వంటి వ్యవస్థలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. "ప్రిడిక్షన్ చేశాక.. ప్రొడక్షన్‌కు వెళ్లాలి... ఆ మేరకు మార్కెట్ కూడా అంచనా వేసుకోవాలి" అని సీఎం స్పష్టం చేశారు.

రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా సరఫరా

రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేసేలా చూడాలని సీఎం సూచించారు. ఉల్లి, కంది పప్పు వంటి వాటిని త్వరలో రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా అందించాలన్నారు. పామాయిల్‌ను కూడా రేషన్ డిపోల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఉల్లి, మిర్చి వంటి పంటలను ఎప్పుడూ పండించే ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పండించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల వారీగా ఏయే పంటలు పండిస్తున్నారో తెలుసుకోవాలని, ఉల్లి ఎంత అవసరం, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందో అంచనా వేసుకోవాలని అన్నారు. ధరలు ఏ విధంగా పెరుగుతాయో ముందుగానే అంచనా వేసి, ప్రస్తుత మార్కెట్‌ను నియంత్రణ చేసుకుంటూ అవసరమైన పంటలు వేసేలా చూడాలని సూచించారు. రాయితీ విత్తనాలు, అవసరమైన యంత్ర పరికరాలు ఇచ్చి ఆ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా పశుగ్రాసం లేక పాల ఉత్పత్తి తగ్గిందనే మాట రాకూడదని, పశువుల దాణాకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు.

అంచనాల ఆధారంగా పంటల సాగు

రాష్ట్రంలో పంటల సాగు చేయని 8.61 లక్షల హెక్టార్లలో వర్షాధార పంటలు వేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. చిరు ధాన్యాలు, రాగి, కొర్రలు, జొన్న, బాజ్రా వంటి పంటలను సాగు చేయించాలని, మొక్కజొన్న వేసేలా చూడాలని సూచించారు. ఉలవల సాగుపై కూడా దృష్టి పెట్టాలని, నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలని అన్నారు. ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు వేయవచ్చో గుర్తించి, ఆ మేరకు రైతులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 3.61 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు హైరిస్క్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొనగా, వాటిని రక్షించేందుకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కోసం రూ.190 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ నిధులను హైరిస్క్‌లో ఉన్న ఉద్యాన పంటలను రక్షించేందుకు అవసరమైన చర్యలకు, వాటర్ ట్యాంకర్లను పంపించడం వంటి చర్యలకు వినియోగించాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు ISSCA గ్లోబల్ అవార్డు-2026 (ICRISAT Center of Excellence for South-South Cooperation in Agriculture) రావడంపై అధికారులను సీఎం అభినందించారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.