విజయనగరం, ఆగస్టు 21: విశాఖపట్నంలో ఆగస్టు 22, 23 తేదీల్లో నిర్వహించనున్న బ్రిక్స్ (BRICS) సదస్సుకు వివిధ దేశాల నుంచి విచ్చేస్తున్న ప్రతినిధులకు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయనగరం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా మేళతాళాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో విదేశీ ప్రతినిధులకు ఆత్మీయ స్వాగతం పలికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. ప్రతినిధుల రాక సందర్భంగా విమానాశ్రయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
బ్రిక్స్ సదస్సుకు సంబంధించి అందుబాటులో ఉన్న ప్రతినిధుల జాబితా ప్రకారం రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు.
రష్యా తరఫున క్రీడల ఉప మంత్రి అలెక్సీ మొరోజోవ్, చైనా తరఫున క్రీడల సాధారణ పరిపాలనా సంస్థ ఉప మంత్రి కుయ్ జియాన్, దక్షిణాఫ్రికా తరఫున క్రీడలు, కళలు మరియు సంస్కృతి శాఖ ఉప మంత్రి పీస్ మాబే, ఈజిప్ట్ తరఫున కౌన్సిలర్ మొహమ్మద్ ఖాటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడీ వార్డోయో తదితరులు ఉన్నారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు.
భారతదేశం తరఫున కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, క్రీడల కార్యదర్శి హరి రంజన్ రావు పాల్గొంటున్నారు.
