విజయనగరం, అక్టోబర్ 1 (ఎక్స్‌ప్రెస్ టుడే): జిల్లాలో రెవెన్యూ సేవలు, పాస్ పుస్తకాల పంపిణీ, అగ్రిస్టేక్ మరియు భూ రీ-సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ నుండి ఆన్‌లైన్ ద్వారా రెవెన్యూ మరియు రీ-సర్వే అంశాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో నవంబర్ నెల పాస్ పుస్తకాల పంపిణీపై ప్రత్యేకంగా చర్చించారు. మొత్తం 101 గ్రామాలు ప్రతిపాదించగా, ఇప్పటివరకు 48 గ్రామాలు మాత్రమే వెబ్‌ల్యాండ్‌కు పోర్ట్ అయ్యాయని, మిగిలిన గ్రామాలకు సంబంధించిన ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే, నవంబర్ నెల గ్రామాలకు సంబంధించి మొత్తం 54,509 ఖాతాలకు గాను 49,518 ఖాతాల ఈ-కేవైసీ పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న 4,991 ఖాతాల ప్రక్రియను త్వరితగతిన ముగించాలని ఆదేశించారు.

రీ-సర్వేలో పురోగతి... అధికారులకు ప్రత్యేక ఆదేశాలు

జిల్లాలో ఆరు దశల రీ-సర్వే గ్రౌండ్ ట్రూటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,31,613.58 ఎకరాలకు గాను ఇప్పటివరకు 78.47 శాతం ప్రగతి సాధించినట్లు ఆయన తెలిపారు. తహశీల్దార్, ఆర్డీవో, మరియు డి.ఎల్.ఆర్ స్థాయిల్లో అపరిష్కృతంగా ఉన్న దస్త్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.