విజయనగరం, అక్టోబర్ 24: ఖరీఫ్ (2026–27) ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు అధ్యక్షతన శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మిల్లర్లు సహకరించాలని సూచించారు. ధాన్యం సేకరణలో భాగంగా ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలని, అవసరమైన గోనె సంచులను ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాలు, హమాలీలు, ఇతర సౌకర్యాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ధాన్యాన్ని సకాలంలో మర ఆడించి, నిర్దేశిత పరిమాణంలో సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయాలని స్పష్టం చేశారు. సీఎంఆర్ బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.

ధాన్యం సేకరణలో ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు సకాలంలో సేవలు అందేలా సంబంధిత అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని డీఆర్వో సూచించారు.

ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బి శాంతి, లీడ్ బ్యాంకు మేనేజర్ వివి రమణమూర్తి, విజిలెన్స్ ఉప కలెక్టర్ అరుణకుమారి, మిల్లర్ల సంఘం అధ్యక్షులు, సంబంధిత విభాగాల అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.