విజయనగరం, అక్టోబర్ 31 (ఎక్స్‌ప్రెస్ టుడే): జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు.
రీషెడ్యూల్ చేసిన ఎన్నికల పోలింగ్ నవంబర్ 5వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
పోలింగ్‌కు ముందు రోజైన నవంబర్ 4వ తేదీన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అదేవిధంగా నవంబర్ 5వ తేదీన పోలింగ్ ప్రక్రియ నిర్వహించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ పరిధిలోని భవనాలకు సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఎన్నికల రోజున ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా, సంబంధిత ఎన్నికల ప్రాంతాల్లోని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇతర స్థాపనల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు (పెయిడ్ హాలిడే) ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం-1988 నిబంధనల మేరకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ మరియు ప్రైవేటు సంస్థలకు, కంపెనీలకు 5వ తేదీన స్థానిక సెలవుగా ప్రకటించినట్లు తెలిపారు.
సంబంధిత యాజమాన్యాలు ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వులను అన్ని సంబంధిత శాఖల అధికారులు, సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని, నిబంధనల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
