విజయనగరం/భోగాపురం, అక్టోబర్ 31 (ఎక్స్‌ప్రెస్ టుడే): భోగాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని రావాడ-2, రావాడ-3 అంగన్వాడీ కేంద్రాలను ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శనివారం సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్రాల నిర్వహణ, పిల్లల హాజరు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్ సరుకుల పంపిణీ, నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల శారీరక ఎదుగుదల, పోషకాహార స్థితిగతులు, స్టంటింగ్, వేస్టింగ్ సమస్యలపై ఆరా తీశారు.
నవచేతన యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ ప్రక్రియను పరిశీలించి, చిన్నారుల్లో అభివృద్ధి లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఈ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఇండక్షన్ స్టవ్‌లను వినియోగించాలని తెలిపారు. ప్రీ-స్కూల్ క్యాలెండర్‌ను పరిశీలించి, నిర్దేశిత ప్రణాళిక ప్రకారం చిన్నారులకు బోధన అందించాలని సిబ్బందికి సూచించారు.
కేంద్రాలకు అవసరమైన అదనపు వసతుల వివరాలను తెలియజేయాలని అన్నారు.