విశాఖపట్నం, అక్టోబర్ 2 (ఎక్స్‌ప్రెస్ టుడే): విశాఖపట్నాన్ని దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రపంచ స్థాయి పరిశుభ్రత ప్రమాణాలను సాధించే దిశగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఎంపీ శ్రీ భరత్, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు.

గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనాలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల జిల్లా స్థాయి పురస్కార ప్రదానోత్సవంలో వారు మాట్లాడారు. మహాత్మా గాంధీ జయంతి రోజున స్వచ్ఛత కోసం కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

విశాఖపట్నంలో ఆధునిక పారిశుధ్య విధానాలు, మెకనైజ్డ్ శానిటేషన్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌తో పాటు సముద్రంలో వ్యర్థాలను తొలగించే ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. సుమారు రెండు దశాబ్దాలుగా నగరంలో ఆధునిక పారిశుధ్య విధానాలు అమలవుతున్నాయని చెప్పారు. అయితే కేవలం పారిశుధ్య కార్మికుల కృషితోనే ప్రపంచ స్థాయి పరిశుభ్రత సాధ్యం కాదంటూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే స్వచ్ఛతకు అసలైన మార్గమని స్పష్టం చేశారు.

24 గంటలూ పారిశుధ్య సిబ్బంది పనిచేసినా, మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసినా ప్రజల ప్రవర్తనలో మార్పు రాకపోతే ఆశించిన ఫలితం సాధ్యం కాదన్నారు. విశాఖను రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో జపాన్ స్థాయి పరిశుభ్రత ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయాలన్నారు. జపాన్‌లో చిన్న కాగితం ముక్కను కూడా బహిరంగ ప్రదేశంలో వేయకుండా ప్రజలు పాటించే క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

విశాఖపట్నం ఇప్పటికే దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఉందని, రాబోయే రోజుల్లో గ్లోబల్ సిటీగా ఎదగాలంటే పరిశుభ్రతలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వచ్ఛత కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడే పరిశుభ్రమైన నగరం సాధ్యమవుతుందని ఎంపీ ఎం. శ్రీభరత్ అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది కృషితో పాటు ప్రజల వైఖరిలో మార్పు తీసుకురావడం అత్యంత ముఖ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడానికి ప్రజలు సిగ్గుపడతారని, అదే స్థాయి ప్రవర్తనా మార్పు మన సమాజంలోనూ రావాల్సి ఉందన్నారు. ప్రజలతో మమేకమై స్వచ్ఛత వల్ల కలిగే ప్రయోజనాలు, నిర్లక్ష్యం వల్ల కలిగే నష్టాలను అధికారులు వివరించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా పారిశుధ్యంపై అవగాహన పెరిగిందన్నారు.

విశాఖపట్నంలో సుమారు 20 లక్షల జనాభాకు పరిమిత సంఖ్యలోనే పారిశుధ్య కార్మికులు ఉన్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. నగర పరిశుభ్రత బాధ్యతను కేవలం పారిశుధ్య కార్మికులపైనే వదిలేయకుండా ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు వచ్చే క్లాప్ వాహనాలకు చెత్తను అందించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఇళ్ల నుంచి రోడ్లపైకి చెత్త, ప్లాస్టిక్ సంచులు విసరకూడదని సూచించారు. తుఫానులు, వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పారిశుధ్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు.