విశాఖపట్నం, అక్టోబర్ 2 (ఎక్స్ప్రెస్ టుడే): ఋషికొండ ఐటీ జంక్షన్ సమీపంలో సముద్రంలో శుక్రవారం గల్లంతయిన విద్యార్థుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు.
గల్లంతయిన వారిలో ప్రశాంత్ అనే విద్యార్థి మృతదేహం సముద్ర తీరానికి ఒక కిలోమీటరు దూరంలో లభ్యమైందని, తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు.
పీఎం పాలెంకు చెందిన ప్రశాంత్, నీలేష్, మధురవాడకు చెందిన సూర్య ప్రకాష్ సృజన పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారని, పాఠశాలకు సెలవు కావడంతో మధ్యాహ్నం ఐటీ సెజ్ జంక్షన్ సమీపంలో సముద్రంలో దిగి గల్లంతయ్యారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ యంత్రాంగాన్ని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
జీవీఎంసీ నుంచి 7 మంది గజ ఈతగాళ్లు, మత్స్యశాఖకు చెందిన నాటు పడవలు, కోస్ట్ గార్డ్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారన్నారు. ప్రశాంత్ మృతదేహం దొరకగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయని పేర్కొన్నారు.
చీకటి పడే వరకు హెలికాప్టర్ ద్వారా గాలింపు చేశామని, పోలీస్, రెవెన్యూ బృందాలు సంఘటన జరిగిన ప్రాంతంలోనే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. పోలీసులు డ్రోన్ బృందంతో కూడా గాలింపు చేస్తున్నారని చెప్పారు.
ఇప్పటికే నేవీ అధికారులతో మాట్లాడామని, నేడు ఉదయం నేవీ ద్వారా కూడా గాలింపు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. రేవిడి, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు.
డీఆర్వో భీమిలి సంగీత్ మాధుర్, తహసీల్దార్లు, స్థానిక ఏసీపీ అప్పలరాజు, పోలీస్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితర అధికారులు ఆ ప్రాంతంలోనే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
